Andhra News: ఆర్థిక ఇబ్బందుల వల్లే ‘దుల్హన్‌’ నిలిపివేత: హైకోర్టుకు తెలిపిన ఏపీ సర్కారు

ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిం మైనారిటీ యువతులకు వివాహం సందర్భంగా ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన దుల్హన్‌ పథకాన్ని నిలిపివేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు

Published : 23 Jun 2022 14:32 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిం మైనారిటీ యువతులకు వివాహం సందర్భంగా ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన దుల్హన్‌ పథకాన్ని నిలిపివేసినట్లు హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ పథకం ప్రస్తుతం అమలులో లేదని పేర్కొంది. తెదేపా హయాంలో దుల్హన్‌ పథకం కింద పేద ముస్లిం మహిళల వివాహానికి ప్రభుత్వం రూ.50 వేలు అందజేసింది. ఈ పథకం నిలిపివేయడాన్ని సవాల్‌ చేస్తూ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు షారూఖ్‌ షిబ్లి హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనలు వినిపిస్తూ... ఆర్థిక ఇబ్బందుల వల్లే ప్రభుత్వం పథకం అమలు చేయలేకపోతుందని కోర్టుకు తెలిపారు.

‘‘విదేశీ విద్యా పథకం అమలుకు సైతం నిధులు లేవని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మైనారిటీలకు ఉన్నత విద్య కోసం గత ప్రభుత్వ హయాంలో 15 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందేది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా విదేశీ విద్య పథకం కోసం మైనారిటీలకు సాయం అందడం లేదు. 2018, 2019 ఆర్థిక సంవత్సరాల్లో విదేశాలకు వెళ్లి ఉన్నత విద్య అభ్యసించిన 574 మందికి ఇప్పటికీ సాయం విడుదల కాలేదు. ఎస్సీ, బీసీలకు ఆయా సంక్షేమ శాఖల ద్వారా నిధులు విడుదల చేసి మైనారిటీలకు అన్యాయం చేశారు’’ అని పిటిషనర్‌ తరఫు న్యాయవాది హైకోర్టుకు వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు