AP PRC: చర్చలు మినహా ఉద్యోగ సంఘాలకు ప్రత్యామ్నాయం ఏముంది?: సజ్జల

పీఆర్సీపై ఉద్యోగుల్లో అపోహలు తొలగించేందుకు ఓ మెట్టు దిగేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు..

Published : 27 Jan 2022 15:45 IST

అమరావతి: పీఆర్సీపై ఉద్యోగుల్లో అపోహలు తొలగించేందుకు ఓ మెట్టు దిగేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చర్చలకు ఏర్పాటైన మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల కోసం సచివాలయంలోనే అందుబాటులో ఉందని చెప్పారు. అమరావతిలో మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి మీడియాతో సజ్జల మాట్లాడారు. ఎక్కడో కూర్చొని మాట్లాడితే సమస్యకు పరిష్కారం దొరకదని ఉద్యోగ సంఘాలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. డీడీవోలు, పే అండ్‌ అకౌంట్స్‌, ట్రెజరీ ఉద్యోగులు ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించడం క్రమశిక్షణా రాహిత్యమేనన్నారు. శుక్రవారం కూడా సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు అందుబాటులో ఉంటామని చెప్పారు. పీఆర్సీ సాధన సమితి నేతలతో పాటు ఏ ఉద్యోగ సంఘాలు వచ్చినా తాము చర్చిస్తామని.. వారి డిమాండ్లను సీఎంతో చర్చించి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వచ్చి చర్చిస్తేనే వారిపై ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు. 

ప్రభుత్వంతో చర్చలు మినహా ఉద్యోగ సంఘాలకు మరో ప్రత్యామ్నాయం ఏముందని సజ్జల ప్రశ్నించారు. ఆయా సంఘాలు అనాలోచితంగా, అపరిపక్వంగా ఆలోచిస్తున్నట్లుగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. దుందుడుకు వైఖరితో ఒంటెద్దు పోకడలకు వెళ్లొద్దని ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. మంత్రి బొత్స మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలు ముందడుగు వేస్తే మంత్రుల కమిటీతో చర్చలకు రావొచ్చన్నారు. అందుకే ఈరోజు చర్చలకు రావాలని అందర్నీ ఆహ్వానించామని చెప్పారు. మంత్రుల కమిటీపై సాధికారిక ఉత్తర్వులు లేవని అన్నారని.. అందుకే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. దేనికైనా ఎక్కడో ఒకచోట పరిమితి ఉంటుందని.. చర్చించుకున్నప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయని బొత్స అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని