
‘వ్యాట్ పెంపు.. ఎల్పీజీపై కాదు’
అమరావతి: సహజ వాయువుపై విధించే వ్యాట్‌లో మార్పులు చేస్తే కొందరు ఎల్పీజీపై పన్ను పెంచారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ అన్నారు. ఎల్పీజీపై ఎలాంటి పన్నూ పెరగలేదని స్పష్టంచేశారు. సహజ వాయువుపై వ్యాట్ చట్టం ప్రకారం పన్ను పెంచుతూ ఏపీ ప్రభుత్వం శనివారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై గందరగోళం నెలకొనడంతో ఆయన స్పష్టతనిచ్చారు. ఎల్పీజీ వస్తుసేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి వచ్చిందని, కేంద్రం పరిధిలో ఉన్న జీఎస్టీ మండలిలో మాత్రమే ఎల్పీజీ సిలిండర్ల పన్ను రేట్లను సవరించగలదని తెలిపారు. ఎల్పీజీపై ప్రస్తుతం 5 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారని చెప్పారు.
జీఎస్టీ పరిధిలోకి రాని ఐదు పెట్రో ఉత్పత్తులు మాత్రమే వ్యాట్ పరిధిలో ఉన్నాయని రజత్ భార్గవ వివరించారు. సహజ వాయువును విద్యుత్ ఉత్పత్తి కోసం, రవాణా వాహనాలైన ఆటోలు, కార్లు, ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో వినియోగిస్తున్నారని, కొన్ని మెట్రో నగరాల్లో మాత్రమే పైపుల ద్వారా గృహ వినియోగానికి సరఫరా అవుతోందని తెలిపారు. ప్రస్తుతం గృహ వినియోగానికి సరఫరా చేస్తున్న సహజ వాయువుకు 5 శాతం వ్యాట్ ఉందని, ఈ పన్ను రేటులో ఎలాంటి మార్పూ చేయలేదని చెప్పారు. గృహ వినియోగం కాకుండా ఇతర అవసరాలకు వినియోగించే వాటిపై మాత్రమే ప్రస్తుత పన్ను పెంపు వర్తిస్తుంది స్పష్టంచేశారు. సాధారణ ప్రజలపై సీఎన్జీ పన్ను పెంపు వర్తిస్తుందంటూ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని రజత్ భార్గవ వెల్లడించారు.
ap news, ap govt, VAT, CNG, LPG, ఏపీ న్యూస్, వ్యాట్, సీఎన్జీ, ఎల్పీజీ