
PRC : పీఆర్సీ వ్యవహారం.. నలుగురు సభ్యులతో కమిటీ
అమరావతి: ఏపీలో పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాల నేతలు చేస్తున్న ఆందోళనపై రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల కమిటీని నియమించింది. నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల్లోని అనుమానాల నివృత్తికి కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రకటన విడుదల చేసింది. కమిటీలో మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, బుగ్గన రాజేంద్రప్రసాద్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. కమిటీ మెంబర్ కన్వీనర్‌గా సీఎస్ సమీర్‌శర్మ వ్యవహరిస్తారని ప్రభుత్వం పేర్కొంది.
మరోవైపు పీఆర్సీ స్టీరింగ్ కమిటీ నేతలు ఇవాళ ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతున్నట్లు వెల్లడించారు. పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాతే ప్రభుత్వంతో చర్చలకు వెళ్తామని స్పష్టం చేశారు. తమ డిమాండ్లను పరిగణనలోకి తీసుకోకుండా జీవోలు ఇచ్చారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆక్షేపించారు. చర్చల్లో భాగంగా తమ సమస్యలు ఆలకించామని ప్రభుత్వం చెబుతున్నా.. వాటి పరిష్కారానికి ముందుకు రావడం లేదని ఆయన అన్నారు. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వాలని ట్రెజరీ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఆరోపించారు. ఉద్యోగులకు లేని తొందర ప్రభుత్వానికి ఎందుకో అర్థం కావడం లేదని ఆయన విమర్శించారు.
Advertisement