APSRTC: ఆ కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలివ్వం.. ప్రభుత్వ ఆదేశాలపై ఉద్యోగుల ఆందోళన

ఏపీఎస్‌ఆర్టీసీలో మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలిచ్చే విషయమై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అనంతరం...

Updated : 19 Feb 2022 05:47 IST

విజయవాడ: ఏపీఎస్‌ఆర్టీసీలో మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలిచ్చే విషయమై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అనంతరం మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన వారి కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలివ్వాలని నిర్ణయించింది. విలీనానికి ముందు మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన వారి కుటుంబాలకు ఉద్యోగాలివ్వకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2019 డిసెంబరు 31 వరకు మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన వారందరికీ ఉద్యోగాలు కాకుండా మానిటరీ బెనిఫిట్స్‌ మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆర్టీసీని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. విలీనానికి ముందు దరఖాస్తు చేసుకుని పెండింగ్‌లో ఉన్న వారికి మానిటరీ బెనిఫిట్స్‌ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల ఆర్‌ఎంలకు ఆదేశాలు జారీ అయ్యాయి.

2020 జనవరికి ముందు మెడికల్‌ అన్‌ఫిట్‌ అయి ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసిన వారికి కొలువులు ఇవ్వకపోవడంపై ఆర్టీసీ ఐక్యవేదిక అభ్యంతరం తెలిపింది. విలీనానికి ముందు కాలంలో మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు సాధ్యం కాదనడం బాధాకరమని ఐక్యవేదిక నేతలు వై.శ్రీనివాసరావు, దామోదరరావు ఓ ప్రకటనలో తెలిపారు. వారంతా మానిటరీ బెనిఫిట్స్‌ మాత్రమే తీసుకోవాలని ఆర్టీసీ ఎండీ ఆదేశాలు ఇవ్వడం ఎంతగానో బాధించిందని నేతలు పేర్కొన్నారు. ఈ విషయంలో సీఎం జగన్‌ చొరవ తీసుకోవాలని ఐక్యవేదిక డిమాండ్‌ చేసింది. మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన వారికి ఉద్యోగాలివ్వాలని ఉమ్మడి రాష్ట్రంలోనే ఆదేశాలిచ్చారని, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని ఐక్య వేదిక డిమాండ్‌ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని