AP High Court: కోర్టులో కేసు జరుగుతుండగా ఆర్డినెన్స్‌ ఎలా తీసుకొస్తారు?: హైకోర్టు

తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై హైకోర్టులో విచారణ జరిగింది. 

Updated : 28 Feb 2022 15:18 IST

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రత్యేక ఆహ్వానితుల జీవోపై హైకోర్టు గతంలో స్టే ఇచ్చిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. జీవోపై స్టే కొనసాగుతున్నా అదే అంశంపై ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిందన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. న్యాయస్థానంలో కేసు జరుగుతుండగా ఆర్డినెన్స్‌ ఎలా తీసుకొస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి వివరణ ఇస్తూ ప్రత్యేక ఆహ్వానితులను నియమించబోమని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను మార్చి 11కు వాయిదా వేసింది. ఆ రోజే తుది విచారణ జరిగే అవకాశం ఉంది. 

తితిదే బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోపై భాజపా నేత భానుప్రకాశ్‌, మరొకరు పిటిషన్‌ దాఖలు చేశారు. 52 మంది ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారని వారిలో కొంత మందికి నేర చరిత్ర ఉందని, ఇంత మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడం సరికాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి విచారణ జరుగుతుండగానే ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసురావడంపై వాళ్లు మరోసారి పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ విచారణ జరిగింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని