Andhra News: ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయంపై హైకోర్టు స్టే

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లను విక్రయిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంపై ఉన్నత న్యాయస్థానం

Updated : 12 Oct 2022 12:12 IST

అమరావతి: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఆన్‌లైన్‌ ద్వారా సినిమా టికెట్లను విక్రయించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 27కి వాయిదా వేసింది. సినిమా టికెట్లను ప్రభుత్వమే విక్రయించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చిన సవరణ చట్టం, తదనంతరం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ బిగ్‌ ట్రీ ఎంటర్‌టైన్‌మెంట్‌ (బుక్‌మై షో) సహా మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. వీటిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

నేరుగా ప్రభుత్వమే విక్రయిస్తే అభ్యంతరం లేదు.. కానీ..

ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రైవేట్‌ సంస్థల వ్యాపారాన్ని దెబ్బతీస్తుందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వమే నేరుగా ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు విక్రయిస్తే అభ్యంతరం లేదని.. తమను కూడా ఏపీ స్టేట్‌ ఫిల్మ్‌, టెలివిజన్‌ థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ) ద్వారా అమ్మాలని కోరడం సరికాదన్నారు. టికెట్‌ విక్రయానికి రూ.2 సర్వీస్‌ ఛార్జీ కోరుతున్న నేపథ్యంలో ప్రేక్షకులపై తాము అదనంగా భారం వేయాల్సి ఉంటుందని తెలిపారు.

ఈ విధానంతో పారదర్శకత: ఏజీ శ్రీరామ్‌

మరోవైపు ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. నూతన ఆన్‌లైన్‌ విధానంతో టికెట్ల విక్రయంలో పారదర్శకత పెరుగుతుందని.. బ్లాక్‌ మార్కెటింగ్‌ను అరికట్టవచ్చని కోర్టుకు తెలిపారు. బుక్‌మై షో ద్వారా టికెట్‌ కొనుగోలు చేస్తే 14 నుంచి 17 శాతం అదనంగా పడుతుందని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. స్టే విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని