Andhra news: ఏ ప్రాతిపదికన ఇలా చేశారు?.. ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

ధార్మిక పరిషత్‌లో సభ్యుల సంఖ్యను తగ్గించడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని తెలిపింది.

Updated : 25 Apr 2022 15:52 IST

అమరావతి: ధార్మిక పరిషత్‌లో సభ్యుల సంఖ్యను తగ్గించడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆక్షేపించింది. ధార్మిక పరిషత్‌లో సభ్యుల సంఖ్యను కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ పాలెపు శ్రీనివాసులు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ధార్మిక పరిషత్‌లో 21 మంది సభ్యులు ఉండాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని.. సర్వోన్నత న్యాయస్థానం తీర్పునకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం నడుచుకుందని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం సభ్యుల సంఖ్యను 21 నుంచి 4కు కుదించారని.. ఆ నలుగురు కూడా అధికారులేనని కోర్టుకు తెలిపారు.

దీనిపై తీవ్రంగా స్పందించిన న్యాయస్థానం.. సుప్రీం తీర్పునకు వ్యతిరేకంగా ఎలా సభ్యులను కుదిస్తారని.. ఏ ప్రాతిపదికన ఇలా చేశారని ప్రశ్నించింది. నలుగురినే నియమించడం సుప్రీం తీర్పును అమలు చేసినట్లు కాదు కదా అని అసహనం వ్యక్తం చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం పిటిషన్లతో కలిపి విచారించే విధంగా పోస్టింగ్‌ వేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్లపై తదుపరి విచారణను జూన్ 22కు వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని