Bopparaju: ఉద్యోగులు కోరుకునేది జీపీఎస్‌ కాదు ఓపీఎస్‌: బొప్పరాజు వెంకటేశ్వర్లు

తమ ఉద్యమం ఫలితం వల్లే ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.

Updated : 07 Jun 2023 22:28 IST

అమరావతి: తమ ఉద్యమ ఫలితం వల్లే ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. జీపీఎస్‌ విధి విధానాలు ఇంకా ప్రభుత్వం చెప్పలేదన్నారు. గతంలో 28శాతం పెన్షన్‌ ఇస్తామన్నారని.. ఇప్పుడు 50శాతం పెన్షన్‌ ఇవ్వాలని నిర్ణయించారని పేర్కొన్నారు. ఓపీఎస్‌ తరహాలోనే ఉద్యోగి చివరి జీతంలో 50శాతం పింఛనుగా ఇస్తున్నారని, ఓపీఎస్‌ తరహాలోనే ఏడాదికి రెండు సార్లు డీఆర్‌ ఇస్తున్నారని చెప్పారు. కానీ, ఉద్యోగులు కోరుకునేది జీపీఎస్‌ కాదు ఓపీఎస్‌ అని స్పష్టం చేశారు. బిల్లు పెట్టే నాటికి పాత పెన్షన్‌ విధానాన్నే ఆమోదిస్తారని భావిస్తున్నామని బొప్పరాజు పేర్కొన్నారు.

ఏమీ లేని చోట ఏదో ఒకటి రావటం సంతోషమే: వెంకట్రామిరెడ్డి

గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్‌పై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఏపీ సచివాలయ ఉద్యోగుల అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో ఉద్యోగ సంఘాల నేతలతో జరిపిన చర్చల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ 16 శాతం హెచ్‌ఆర్‌ఏను అమలు చేస్తూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. సీపీఎస్ ఉద్యోగులకు మేలు చేసేలా గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ తీసుకురావటం సంతోషదాయకమన్నారు. 50 శాతం పెన్షన్ ఇచ్చేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏమీ లేని చోట ఏదో ఒకటి రావటం సంతోషమే కదా అని ఆయన వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని