Vijayawada: చట్టబద్ధంగా రావాల్సిన వాటి కోసం అడగడం తప్పా?: బొప్పరాజు

కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) రద్దు హామీకి ఇప్పటివరకు అతీగతీ లేకుండా పోయిందని ఏపీ ఐకాస అమరావతి ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. డిమాండ్లను పరిష్కరించాలని విజయవాడలోని ధర్నా చౌక్‌ వద్ద ఏపీ ఐకాస అమరావతి ఉద్యోగ సంఘాల నేతలు దీక్ష చేపట్టారు.

Updated : 30 May 2023 15:05 IST

విజయవాడ: కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) రద్దు హామీకి ఇప్పటివరకు అతీగతీ లేకుండా పోయిందని ఏపీ ఐకాస అమరావతి ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన 14శాతం పెంపును కూడా అమలు చేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు డిమాండ్లను పరిష్కరించాలని విజయవాడలోని ధర్నా చౌక్‌ వద్ద ఏపీ ఐకాస అమరావతి ఉద్యోగ సంఘాల నేతలు దీక్ష చేపట్టారు.

ఏపీ ఐకాస అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ధర్నా చౌక్‌ వద్ద మీడియాతో మాట్లాడారు. ‘‘ఉద్యమ కార్యాచరణ వల్ల ఒక్క డీఏ ఇస్తామని ప్రకటించారు. రాబోయే ఉద్యమమంతా ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులదే. ఉద్యమం చేస్తున్నామనే మళ్లీ అ.ని.శా. దాడులు మొదలయ్యాయి. ఇలా దాడులు చేసి ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోంది. చట్టబద్ధంగా రావాల్సిన వాటి కోసం అడగడం తప్పా? 84 రోజులుగా ఆందళనలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఉద్యమం ఆగాలంటే డిమాండ్లు పరిష్కరించాల్సిందే. 50 డిమాండ్ల పరిష్కారం మినహా ప్రత్యామ్నాయం లేదు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం తీవ్రమవుతుంది. అదే జరిగితే పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే.

సచివాలయ ఉద్యోగులకు డీఏలు అవసరం లేదా?

ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ప్రభుత్వ వాదనే వినిపిస్తున్నారు. గతంలోనే వెంకట్రామిరెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. సచివాలయ ఉద్యోగులకు పీఆర్‌సీ బకాయిలు, డీఏలు అవసరం లేదా?సచివాలయ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు ఉండాలా?లేదా?వెంకట్రామిరెడ్డి చెప్పినవన్నీ ప్రభుత్వం చెప్పినట్లుగానే భావిస్తున్నా. ఇదంతా ప్రభుత్వ కుట్రలో భాగమే’’ అని బొప్పరాజు వ్యాఖ్యానించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని