Vijayawada: న్యాయవాదులకు సీఐడీ నోటీసులు.. సీజేను కలిసిన లాయర్లు

న్యాయవాదులకు సీఐడీ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ న్యాయవాదుల బృందం సీజే జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్ మిశ్రాను కలిసింది. న్యాయవాదుల హక్కులను రక్షిస్తామని న్యాయమూర్తి హామీ ఇచ్చినట్లు పేర్కొంది.

Published : 21 Apr 2023 15:45 IST

అమరావతి: ఛార్టెర్డ్‌ అకౌంటెంట్‌ కె.శ్రావణ్‌కుమార్‌ను అరెస్టు చేయడంపై విజయవాడలో ఏపీ ప్రొఫెషనల్‌ ఫోరం ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడిన న్యాయవాదులకు సీఐడీ 160 సీఆర్‌ పీసీ నోటీసులు ఇవ్వడాన్ని ఏపీ న్యాయవాదులు తీవ్రంగా తప్పుబట్టారు. సీఐడీ నోటీసులు ఇవ్వడంపై ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాను శుక్రవారం న్యాయవాదుల బృందం కలిసింది. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ..  న్యాయవాదుల హక్కులను రక్షిస్తామని సీజే హామీ ఇచ్చినట్లు చెప్పారు. పోలీసులు తాము చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని హితవు పలికారు. నోటీసు ఉపసంహరించుకోకుంటే న్యాయవ్యవస్థ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. దీనిపై తమదైన శైలిలో నిరసనలు తెలుపుతున్నామన్న  న్యాయవాదులు.. పోలీసుల చర్యను ప్రాథమిక హక్కులకు సంబంధించిన విషయంగా భావిస్తున్నామన్నారు. వాక్‌ స్వాతంత్ర్య హక్కు పరిధిలోనే తాము మాట్లాడుతున్నట్లు చెప్పారు.

ఇదే అంశంపై విజయవాడ కోర్టు వద్ద బెజవాడ బార్ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 17న ధర్నా చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో సీనియర్‌ న్యాయవాదులు చలసాని అజయ్‌కుమార్‌, గొట్టిపాటి రామకృష్ణప్రసాద్‌, సుంకరి రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ సీఐడీ చర్యలను ఖండించారు. ప్రాథమిక హక్కులు ప్రమాదంలో పడ్డాయని.. తమ నోరు నొక్కేయడం సరికాదని నినాదాలు చేశారు. ప్రజల హక్కులను కాపాడే బాధ్యత తమపై ఉందన్నారు. సీఐడీ నోటీసులకు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడబోమని తేల్చిచెప్పారు.

ఈ విషయంలో తమ పోరాటం ఆగదని న్యాయవాదులు స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకున్న చర్య సరైందా? లేదా? అనే అంశంపైనే రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగిందన్నారు. సీఐడీ మాత్రం తన పరిధి దాటి న్యాయవాదులకు నోటీసులు ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  అధికారులు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లు ఆడుతున్నారని మండిపడ్డారు. సీఐడీ నోటీసులను తీవ్రంగా ఖండిస్తున్నామని.. వాటిని బేషరతుగా ఉపసంహరించుకోవాలని న్యాయవాదులు డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని