Andhra News: రైలు ప్రమాదం.. 141 మంది ఏపీ వాసుల కోసం ప్రయత్నిస్తున్నాం: బొత్స

ఒడిశా రైలు ప్రమాద ఘటనకు సంబంధించి సహాయక చర్యలపై రాష్ట్రమంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్‌, కారుమూరి నాగేశ్వరారవు విశాఖలో అధికారులతో సమీక్షించారు.

Updated : 03 Jun 2023 19:48 IST

విశాఖపట్నం: ఒడిశా రైలు ప్రమాద ఘటనకు సంబంధించి సహాయక చర్యలపై రాష్ట్రమంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్‌, కారుమూరి నాగేశ్వరారవు విశాఖలో అధికారులతో సమీక్షించారు. అనంతరం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ... రైలు ప్రమాద ఘటనపై సీఎం జగన్‌ నిరంతరం సమీక్షిస్తున్నారని తెలిపారు. తీసుకోవాల్సిన సహాయక చర్యలపై మంత్రులు, అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. పరిశ్రమల శాఖమంత్రి అమర్నాథ్‌ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్‌, ముగ్గురు ఐపీఎస్‌ అధికారులతో కూడిన బృందాన్ని ఒడిశాకు పంపించారని తెలిపారు.

‘‘కోరమాండల్‌, యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లలో మొత్తం 141 మంది ఫోన్లు సిచ్ఛాఫ్ వస్తున్నాయి. వారి వివరాలు సేకరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇచ్చాపురం నుంచి ఒంగోలు వరకు ఆసుపత్రులను అలర్ట్‌ చేశాం. గాయపడిన వారు ఎవరు వచ్చినా చికిత్స అందిస్తాం. రైలు ప్రమాదంలో గాయపడి విశాఖ వచ్చిన ఇద్దరు ప్రయాణికులను వెంటనే సెవెన్‌హిల్స్‌ ఆసుపత్రిలో చేర్పించాం. ఒడిశాకు 108 అంబులెన్స్‌లు 25, ప్రైవేటు అంబులెన్స్‌లు 25 పంపించాం. 

అత్యవసర కార్యకలాపాల కోసం ఒక చాపర్‌ కూడా సిద్ధంగా ఉంచాం. అవసరమైతే క్షతగాత్రులను ఎయిర్‌ లిఫ్ట్‌ చేస్తాం.  నేవీ సహకారం కూడా తీసుకుంటున్నాం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. సహాయక చర్యలపై సీఎం జగన్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. క్షతగాత్రులకు అవసరమైతే భువనేశ్వర్‌ ఆపోలోనే చికిత్స అందించడానికి చర్యలు తీసుకున్నాం. ఈ మేరకు అపోలో ఆసుపత్రి యాజమాన్యంతో కూడా మాట్లాడాం. ప్రయాణికుల సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్లకు తెలియజేయాలని కోరుతున్నాం’’ అని మంత్రి బొత్స తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని