Andhra News: రండి మళ్లీ చర్చిద్దాం: ఉద్యోగ సంఘాలకు మంత్రి బొత్స పిలుపు

ఆంధ్రప్రదేశ్‌లో కాంట్రిబ్యూటరీ పింఛను పథకం (సీపీఎస్‌) రద్దు కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగ సంఘాలకు

Updated : 06 Sep 2022 14:04 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కాంట్రిబ్యూటరీ పింఛను పథకం (సీపీఎస్‌) రద్దు కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగ సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరోసారి పిలుపొచ్చింది. ఈరోజు చర్చలకు రావాలని ఏపీసీపీఎస్‌ఈఏ, ఏపీసీపీఎస్‌యూఎస్‌ సంఘాలను మంత్రి బొత్స సత్యనారాయణ ఆహ్వానించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సీపీఎస్‌ స్థానంలో ప్రభుత్వం గ్యారంటీ పింఛను పథకం (జీపీఎస్‌) అమలు చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు తెలిపింది. దీనిపై ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

తాజాగా మంత్రి బొత్సతో జరిగే సమావేశంలో ప్రభుత్వం గ్యారంటీ పింఛను పథకం (జీపీఎస్‌)పై చర్చ అంటే ఏం చేయాలన్న దానిపై ఉద్యోగ సంఘాలు తర్జన భర్జన పడుతున్నాయి. అసలు సమావేశానికి వెళ్లాలా? వద్దా. అన్న సందిగ్ధంలో ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. జీపీఎస్‌కు అంగీకరించేది లేదని ఇప్పటికే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి స్పష్టం చేశాయి. ఈ విషయాన్ని గతంలోనే బొత్సకు తెలిపాయి. ఓపీఎస్‌ మినహా ఏ ప్రతిపాదనకూ అంగీకరించేది లేదని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.

ఇప్పటికే చలో విజయవాడ, మిలియన్‌ మార్చ్‌ సభల అనుమతికి ఉద్యోగ సంఘాలు యత్నిస్తుండటం, నిరసనకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి పిలుపురావడం చర్చనీయాంశమైంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని