Odisha Train Tragedy: అవసరమైతే ఎయిర్‌ లిఫ్ట్‌ చేయాలని సీఎం ఆదేశించారు: మంత్రి అమర్నాథ్‌

రైలు ప్రమాదంలో 178 మంది తెలుగు వారు ఉన్నారని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ తెలిపారు. మృతులు, గాయపడ్డవారు, మిస్సింగ్ వివరాల సమాచారం అధికారులు సేకరిస్తున్నారని చెప్పారు.

Updated : 03 Jun 2023 15:09 IST

అమరావతి: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటన స్థలానికి ముగ్గురు ఐఏఎస్‌, ముగ్గురు ఐపీఎస్ అధికారుల బృందంతో కలిసి ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అవసరమైతే ఎయిర్ లిఫ్ట్ చేయమని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశించారని తెలిపారు. 

రాష్ట్రానికి చెందిన వైద్యుల బృందాన్ని క్షతగాత్రులకు చికిత్స అందించడానికి పంపామని చెప్పారు. జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. మొబైల్ ఫోన్లకు రెస్పాండ్ కాని ప్రయాణికులను గుర్తించే పనిలో ఉన్నామని, శ్రీకాకుళం పరిసర జిల్లాలో ఉన్న ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు, అంబులెన్స్‌లను ఘటనా స్థలానికి పంపించాలని సీఎం ఆదేశించారని వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించేందుకు ఎంత ఖర్చయినా వెనకాడబోమని సీఎం చెప్పారన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి 104, 108 వాహనాలతో పాటు డాక్టర్లను కూడా తరలిస్తున్నామని తెలిపారు.

రైలు ప్రమాదంలో 178 మంది తెలుగు వారు ఉన్నారని మంత్రి అమర్నాథ్‌ తెలిపారు. మృతులు, గాయపడ్డవారు, మిస్సింగ్ వివరాల సమాచారం అధికారులు సేకరిస్తున్నారని చెప్పారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లలో‌ కంట్రోల్ రూమ్‌లు పనిచేస్తున్నాయన్నారు. విజయవాడలో దిగాల్సి‌న 39 మందిలో 23 మంది కాంటాక్ట్‌లోకి వచ్చారని వెల్లడించారు. ఐదుగురి ఫోన్లు స్విచ్ఛాఫ్‌లో ఉన్నాయని.. మరో ఇద్దరి ఫోన్లు నాట్ రిచబుల్ అని వస్తున్నాయన్నారు. ఐదుగురు ఫోన్లు లిఫ్ట్‌ చేయడం లేదని మంత్రి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని