Andhra News: నిబంధనల ప్రకారమే రెవెన్యూ ఉద్యోగులు దేవాదాయశాఖలోకి: మంత్రి సత్యనారాయణ

అర్చకుల చేతుల్లో ఉన్న భూములకు సంబంధించిన పర్యవేక్షణ దేవాదాయశాఖదేనని మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

Published : 17 Aug 2022 01:51 IST

అమరావతి: అర్చకుల చేతుల్లో ఉన్న భూములకు సంబంధించిన పర్యవేక్షణ దేవాదాయశాఖదేనని మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  అర్చకుల చేతుల్లో ఉన్న భూముల నుంచి వచ్చే ఫలసాయాన్ని మాత్రమే వారు అనుభవించవచ్చన్నారు. దేవుడి మాన్యం భూములపై హక్కులు దేవాదాయశాఖవే.. దాని మీద ఫలసాయం పొందే అవకాశం మాత్రమే దరఖాస్తు దారులకు ఉంటుందని తెలిపారు. దేవాదాయశాఖలో ఉద్యోగుల కొరత ఉందన్న మంత్రి.. నిబంధనల ప్రకారమే రెవెన్యూ శాఖ ఉద్యోగులను దేవాదాయశాఖలోకి తీసుకుంటున్నామన్నారు. ఐఏఎస్‌ అధికారులు, రెవెన్యూ అధికారులు వచ్చినంత మాత్రాన శాస్త్ర ప్రకారం జరగదంటే ఎలా అని ప్రశ్నించారు.  రెవెన్యూ అధికారులు పరిపాలన చేస్తారు తప్ప... నామం ఎలా పెట్టాలో చెప్పరు కదా అని వ్యాఖ్యానించారు.

 4.20లక్షల ఎకరాల భూమి దేవాదాయశాఖ పరిధిలో ఉందని, వీటిలో కొన్ని ఆక్రమణల్లో ఉన్నాయన్నారు. దేవుడి మాన్యం భూముల్లో ఆక్రమణలను స్వాధీనం చేసుకునేప్రయత్నం చేస్తామన్నారు. సీఎం జగన్‌ ఆదేశంతోనే ధార్మిక పరిషత్‌ ఏర్పాటు చేశామని కొట్టు సత్యనారాయణ తెలిపారు. మఠాధిపతుల విషయంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే ఆ సమస్యను ధార్మిక పరిషత్‌ పరిష్కరిస్తుందన్నారు. మఠాలకు, పీఠాలకు భూముల లీజు, లీజు పొడిగింపు అంశాలను ధార్మిక పరిషత్తే పర్యవేక్షిస్తుందన్నారు. దేవాదాయశాఖ చేయలేని ఎన్నో పనులను ధార్మిక పరిషత్‌ ద్వారా చేసే అవకాశం ఉందన్నారు. ధూప దీప నైవేద్యాల నిమిత్తం నిధులు కావాలని సుమారు 3,500 దేవాయాలు దరఖాస్తు చేసుకున్నాయన్నారు. అర్హత ఉన్న ప్రతి దేవాయాలయానికి  ధూప దీప నైవేద్యం స్కీం కింద నెలకు రూ.5వేల చొప్పున నిధులు ఇస్తామన్నారు. గత ప్రభుత్వం పడగొట్టిన 44 ఆలయాల్లో ఏడు ఆలయాల పునఃనిర్మాణం పూర్తయిందని మంత్రి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని