Peddireddy: గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా విద్యుత్‌ యూనిట్‌ ధర: మంత్రి పెద్దిరెడ్డి

రాష్ట్రంలో విద్యుత్‌ కొరత తాత్కాలికమేనని.. మే నెల మొదటివారం నాటికి దీన్ని అధిగమిస్తామని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

Updated : 25 Apr 2022 03:56 IST

అమరావతి: రాష్ట్రంలో విద్యుత్‌ కొరత తాత్కాలికమేనని.. మే నెల మొదటివారం నాటికి దీన్ని అధిగమిస్తామని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. బొగ్గు లభ్యత పెంచడం, విద్యుత్‌ కొరతను అధిగమించడం తదితర అంశాలను నిరంతరం పర్యవేక్షించేందుకు రాష్ట్ర ఇంధన శాఖ ఆధ్వర్యంలో కోర్‌ మేనేజ్‌మెంట్‌ టీమ్‌ను ఏర్పాటుచేసినట్లు ఆయన చెప్పారు. విద్యుత్‌ సంస్థల ఉన్నతాధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పరిశ్రమలకు పూర్తిస్థాయిలో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించాలనే లక్ష్యంతో విద్యుత్‌ సంస్థలు అహర్నిశలు కృషి చేస్తున్నాయని మంత్రి చెప్పారు. 

బొగ్గు కొరత కారణంగా దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధానమైన రాష్ట్రాలు తీవ్రమైన విద్యుత్‌ కొరతను ఎదుర్కొంటున్నాయని పెద్దిరెడ్డి అన్నారు. నిబంధనల ప్రకారం థర్మల్ ప్లాంటుల్లో 24 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో కేవలం 2 నుంచి 5 రోజులకు సరిపడా మాత్రమే ఉన్నాయన్నారు. అందుకే రాష్ట్రాల మాదిరిగానే ఇక్కడా విద్యుత్ సరఫరాపై ఆంక్షలు విధించామని చెప్పారు. కొవిడ్‌ పరిస్థితులు, భారీ వర్షాలు బొగ్గు ఉత్పత్తిని ప్రభావితం చేశాయని.. రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధ ప్రభావం అంతర్జాతీయంగా కూడా బొగ్గు కొరతపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు.

దీని వల్ల బొగ్గు ధరలు గతంలో ఎన్నడూ లేనంత రికార్డు స్థాయికి చేరుకున్నాయని.. బొగ్గు దిగుమతి కూడా చాలా కష్టసాధ్యంగా మారిందని పెద్దిరెడ్డి చెప్పారు. అన్ని రాష్ట్రాలూ బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ కొనుగోలు చేసేందుకు క్యూ కడుతున్నందున.. విద్యుత్ ఎక్స్ఛేంజీలలో గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా యూనిట్ ధర రూ.12 నుంచి రూ.20కి పలికిందన్నారు. వేసవి ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో విద్యుత్ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న పంటలను కాపాడుకునేందుకు వ్యవసాయ విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్యుత్ కొరతతో ఎకరం పంట కూడా దెబ్బ తినకూడదని పెద్దిరెడ్డి ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని