Andhra News: ప్రజా విశ్వాసం చూరగొనడమే లక్ష్యం: డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి

ఏపీ డీజీపీగా తనను ఎంచుకున్నందుకు సీఎం జగన్‌కు నూతన డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మంగళగిరిలోని ఆరో బెటాలియన్‌ మైదానంలో మాజీ డీజీపీ గౌతమ్‌

Updated : 19 Feb 2022 13:51 IST

అమరావతి: ఏపీ డీజీపీగా తనను ఎంచుకున్నందుకు సీఎం జగన్‌కు నూతన డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మంగళగిరిలోని ఆరో బెటాలియన్‌ మైదానంలో మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్ వీడ్కోలు కార్యక్రమంలో రాజేంద్రనాథ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరువురు బెటాలియన్‌ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం నిర్వహించిన సభలో రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడారు. ‘‘ప్రజా విశ్వాసం ఎప్పుడూ శిరోధార్యమే. ప్రజల విశ్వాసం చూరగొనడమే లక్ష్యంగా పోలీసులు పని చేయాలి. జిల్లా ఎస్పీలు అందుకు అనుగుణంగా వ్యవహరించాలి. క్షేత్రస్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు పోలీసులంతా బాధ్యతగా ఉండాలి. పోలీసు వ్యవస్థపై ప్రజలకు అత్యున్నత స్థాయి నమ్మకం ఉంటుంది. ప్రజల నమ్మకానికి భిన్నంగా వ్యవహరిస్తే తీవ్ర ప్రభావం ఉంటుంది.

ఎక్కడ చిన్న తప్పు చేసినా మొత్తం పోలీసు వ్యవస్థకే చెడ్డపేరు వస్తుంది. తప్పుడు ఆరోపణలపై దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఆరోపణలపై ఉన్నత స్థాయిలో విచారణ చేస్తాం. పోలీసులు రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాలి. గౌతమ్‌ సవాంగ్‌ పనితీరు నాకు చాలా స్ఫూర్తినిచ్చింది. సవాంగ్‌ సేవలు గుర్తించి ఆయనకు మరో పదవి ఇచ్చింది’’ అని రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. 

అనంతరం గౌతమ్‌ సవాంగ్‌ మాట్లాడారు. పోలీసుల వ్యవహార శైలిలో మార్పులకు కృషి చేసినట్లు చెప్పారు. ‘‘ప్రజలకు పోలీసు వ్యవస్థను చేరువ చేసేందుకు పని చేశా. శాంతి భద్రతల సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇవాళ్టితో 36 ఏళ్ల నా పోలీస్‌ సర్వీస్‌ ముగుస్తోంది. రెండేళ్ల 8 నెలలు డీజీపీగా కొనసాగించిన సీఎంకు ధన్యవాదాలు. నా బాధ్యతలు నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేశారు. దిశ మొబైల్‌ యాప్‌ నుంచి కూడా కేసులు నమోదయ్యేలా చేశాం. బాధితులు స్టేషన్‌కు రాకుండా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాం. 36శాతం కేసులు డిజిటల్‌గా వచ్చిన ఫిర్యాదులే. 75శాతం కేసుల్లో కోర్టులు విచారణ చేసి శిక్ష విధించాయి. ‘స్పందన’ ఫిర్యాదుల్లో 40వేలకు పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాం. మహిళలు, చిన్నారుల భద్రతకు స్పందన, ఆపరేషన్‌ ముస్కాన్‌ తీసుకొచ్చాం. ఏపీ పోలీసు వ్యవస్థలో డిజిటల్‌గా చాలా మార్పులు తేగలిగాం’’ అని గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు.

బాధ్యతలు చేపట్టిన రాజేంద్రనాథ్‌రెడ్డి..

గౌతమ్‌ సవాంగ్‌ వీడ్కోలు కార్యక్రమం అనంతరం నూతన డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో గౌతమ్‌ సవాంగ్‌ నుంచి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడారు. ‘‘ప్రజల భద్రతే పోలీసుల ప్రథమ కర్తవ్యం. వివక్షకు తావులేని పోలీసింగ్‌ అందించడమే లక్ష్యం. నేరాలు అదుపు చేసేందుకు కృషి చేస్తాం. బడుగు, బలహీనవర్గాలు, మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తాం. ఎర్రచందనం స్మగ్లింగ్, గంజాయి సాగను అడ్డుకుంటాం. కుల, మత, విభేదాల పరిష్కారానికి ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుంటాం. ఆందోళనల పేరిట ఆస్తులపై దాడులకు దిగితే సహించం’’ అని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు.

అంతకముందు మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు పోలీస్‌ ఉన్నతాధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రత్యేకంగా అలంకరించిన జీపులో సవాంగ్‌ను ఎక్కించి అధికారులంతా కలిసి కొద్దిదూరం లాగారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని