Andhra News: విజయవాడలో పోలీసుల ఆంక్షలు.. ప్రయాణికుల అవస్థలు

సీపీఎస్‌ రద్దు కోరుతూ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సీఎంవో ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసుల

Updated : 25 Apr 2022 16:49 IST

విజయవాడ: సీపీఎస్‌ రద్దు కోరుతూ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సీఎంవో ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసుల నిర్బంధాలు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల నుంచి విజయవాడ వస్తున్న ఉపాధ్యాయులను మార్గమధ్యంలోనే అడ్డుకుంటున్నారు. చెన్నై-విజయవాడ జాతీయ రహదారి మార్గంలో పోలీసులు మోహరించి తనిఖీలు నిర్వహిస్తున్నారు. గుర్తింపు కార్డులు ఉన్నవారినే అనుమతిస్తున్నారు. గుంటూరుతో పాటు తాడేపల్లి ప్రాంతంలో సీఎంవోకు వెళ్లే మార్గంలో భారీగా పోలీసులు మోహరించారు. పోలీసుల ఆంక్షలతో ప్రయాణికులు, వాహనదారులు, ఇబ్బందులు పడుతున్నారు. బాపట్ల జిల్లా అద్దంకి, చీరాల కూడళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించి పలవురు యూటీఎఫ్‌ నేతలు, ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్నారు. రైల్వేస్టేషన్లలోనూ ప్రయాణికులను పోలీసులు తనిఖీలు చేశారు. గుర్తింపు కార్డులను పరిశీలించారు.

హనుమాన్‌ జంక్షన్‌-ఏలూరు రోడ్డులో భారీగా ట్రాఫిక్‌జామ్‌

కృష్ణా జిల్లా గుడివాడలో సుమారు వందమంది, కంకిపాడు టోల్‌గేట్‌ వద్ద 15 మంది టీచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ వైపు వెళ్లే బస్సులను ఉదయం నుంచి నిలిపివేశారు. హనుమాన్‌ జంక్షన్‌, గన్నవరం బస్సులను నిలిపేయడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు యూటీఎఫ్‌ నేతల ఆందోళనతో హనుమాన్‌ జంక్షన్‌ వద్ద భారీగా రద్దీ నెలకొంది. వ్యక్తిగత వాహనాలను సైతం విజయవాడ వైపు పోలీసులు అనుమతించడం లేదు. దూరప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులనూ విడిచిపెట్టడం లేదు. దీంతో హనుమాన్‌జంక్షన్‌ నుంచి ఏలూరు రోడ్డు వైపు భారీగా ట్రాఫిక్‌జామ్‌ అయింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని