AP PRC: ‘చలో విజయవాడ’కు అడుగడుగునా అడ్డంకులు.. ఎక్కడికక్కడ ఉద్యోగుల నిర్బంధాలు

పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు తలపెట్టిన ‘చలో

Updated : 03 Feb 2022 09:50 IST

అమరావతి: పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు తలపెట్టిన ‘చలో విజయవాడ’కు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. జిల్లాల నుంచి విజయవాడ బయల్దేరిన ఉద్యోగులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. పలుచోట్ల ఉద్యోగ సంఘాల నేతలను గృహనిర్బంధం చేస్తున్నారు. ‘చలో విజయవాడ’కు అనుమతి లేదంటూ పలుచోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఉద్యోగులు వచ్చే వాహనాలను వెనక్కి పంపుతున్నారు. నిరసనలో పాల్గొనేందుకు అనంతపురం, కర్నూలు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కడప, ప్రకాశం జిల్లాల నుంచి బస్సులు, ప్రైవేటు వాహనాల్లో బయలు దేరిన ఉద్యోగులను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో వారంతా పోలీసుల వైఖరి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. 

విజయవాడ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న పలువురు ఉద్యోగులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ చేసిన వారిని కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరికొందరు ఉద్యోగులను బస్టాండ్‌ ఎదురుగా ఉన్న ఫుడ్‌కోర్టులో ఉంచారు. తమ అరెస్ట్‌లపై ఉద్యోగ సంఘాల నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి వాహనాల్లో వచ్చిన ఉద్యోగులను ఏలూరు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వారిని పెదవేగిలోని పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌కు తరలించారు. కడప జిల్లా నుంచి విజయవాడ వెళ్తున్న ఉద్యోగులను నెల్లూరు జిల్లా కావలి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పీఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు జమాల్‌రెడ్డి, ట్రెజరీ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్‌కుమార్‌తో పాటు పలువరు ఉద్యోగులు, ఉపాధ్యాయులను కావలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల కళ్లుగప్పి మారువేషాల్లో.. 

పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటుండటంతో కొందరు ఉద్యోగులు మారు వేషాల్లో విజయవాడ వెళ్లేందుకు యత్నించారు. నెల్లూరు రైల్వేస్టేషన్‌లో ఆత్మకూరు మండలానికి చెందిన ఓ ఉద్యోగి అంగవైక్యం ఉన్న వ్యక్తిగా మారు వేషంలో వెళ్తుండగా అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు ఉద్యోగులు కూలీల మాదిరిగా రైల్వే స్టేషన్లకు చేరుకున్నారు. వారిలో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరికొందరు వారి కళ్లు గప్పి విజయవాడ చేరుకున్నారు. 


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని