Updated : 26 Jan 2022 15:30 IST

AP PRC: పీఆర్సీ ఇచ్చేది జీతాలు పెంచడానికా? తగ్గించడానికా?: బొప్పరాజు

విజయవాడ: పీఆర్సీ ఉద్యమం, చర్చలు ముగిసే వరకు తమకు పాత జీతాలే ఇవ్వాలని వారం క్రితమే ప్రభుత్వానికి చెప్పినట్లు పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. కానీ, ప్రభుత్వం కుట్రపూరితంగా కొత్త జీతాలని ఒకసారి, సీఎఫ్‌ఎంస్‌, హెచ్‌ఆర్‌ఎంస్‌ అని మరోసారి చెబుతూ గందరగోళం సృష్టిస్తోందని మండిపడ్డారు. ఈ క్రమంలో జీతాలు ఇవ్వకుండా ఉద్యోగుల్లో అసహనం కలిగేలా చేసి ఉద్యమం దెబ్బతినేలా కుట్ర పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉద్యమ కార్యాచరణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఇవాళ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు ఇస్తున్నారు. విజయవాడలోని బందర్ రోడ్డు ఆర్టీఏ కార్యాలయం ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి వినతులిచ్చారు. పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఆందోళనలో పీఆర్సీ సాధన సమితి నేతలు బండిశ్రీనివాస్, శివారెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, వైవీ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడారు.

‘‘ఈ నెల జీతం రాకుండా ప్రభుత్వం చూస్తోంది. ఉద్యోగుల జీతాలు ఆపితే ఊరుకునేది లేదు. మాకు వేతనాలు తగ్గకుండా చూస్తారని సజ్జల చెబుతున్నారు. పీఆర్సీ ఇచ్చేది జీతాలు తగ్గించడానికా? లేక పెంచడానికా? అనేది చెప్పాలి. కొత్త జీతాలు ఆపి పాతజీతాలు ఇవ్వండి. అలా అయితే ప్రభుత్వానికి రూ.10వేల కోట్లు మిగులుతాయి కదా. మాకు ఏం కావాలో నిన్న మంత్రుల కమిటీకి తెలిపాం. మా డిమాండ్లపై స్పష్టంగా చెబితే చర్చలకు సిద్ధం. జిల్లాల పునర్విభజన ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. మా ఉద్యమం సమయంలోనే జిల్లాల ప్రక్రియ తీసుకొచ్చారు. జిల్లాల పునర్విభజనపై మేం చేయగలిగినంత చేస్తాం. మాపై ఒత్తిడి తీసుకురావొద్దని కలెక్టర్లను కోరుతున్నాం. జిల్లాల విభజన ప్రక్రియపై అధికారుల ఒత్తిళ్లకు లొంగేది లేదు’’ అని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.

మా బాధను మంత్రి అర్థం చేసుకోవాలి: బండి శ్రీనివాసరావు

రాష్ట్రవ్యాప్తంగా అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రాలు ఇచ్చే కార్యక్రమం విజయవంతమైందని పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు అన్నారు. ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని ఆక్షేపించారు. ‘‘సాధారణంగా ఐఆర్ కంటే ఫిట్‌మెంట్ ఎక్కువగానే ఉంటుంది. పీఆర్సీ అంటే  వేతనాలు పెరగాలి కానీ తగ్గకూడదని అధికారులకు తెలియదా?బడ్జెట్ అంతా ఉద్యోగుల వేతనాలకే సరిపోతోందని ప్రభుత్వం అంటోంది. ఇన్నేళ్ల నా సర్వీసులో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. ఇంతవరకు మేం ఆర్థికశాఖ మంత్రి బుగ్గన మొహం చూడలేదు. మా బాధను ఇప్పటికైనా మంత్రి అర్థం చేసుకోవాలి. ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అయింది. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఒక్కటే సమస్య అయితే ఆర్టీసీ ఉద్యోగులకు అన్నీ సమస్యలే. ఆర్టీసీ కార్మికులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలి. సమ్మె మా జన్మ హక్కుగా ముందుకు వెళ్లాలి. ప్రభుత్వం రేపట్నుంచి మమ్మల్ని ఏమైనా చేయొచ్చు.. మా ఇళ్లపై దాడి చేసి మమ్మల్ని అరెస్టులు చేయవచ్చు’’ శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.

ఆత్మాభిమానం కోసమే ఉద్యమం..

ఏపీ ఎన్జీవో సంఘ ప్రధాన కార్యదర్శి శివారెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగులు హక్కులను కోల్పోయే, హరించే పరిస్థితిని ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ప్రభుత్వం కళ్లతో చూసి మా సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నట్లు చెప్పారు. పీఆర్సీ సాధన సమితి నేత హృదయరాజు మాట్లాడుతూ.. ఉద్యోగులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు అమలుకాకపోవడం ఎవరి పొరపాటో ప్రభుత్వం ఆలోచించుకోవాలన్నారు. ప్రభుత్వం తమ మాటలు వినకపోవడం వల్లే అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతి పత్రాలిచ్చామని చెప్పారు. ఆర్టీసీ ఈయూ నేత వైవీ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజ్యాంగం ఉల్లంఘన జరుగుతోందన్నారు. ఉద్యోగుల పీఆర్సీ అంశం న్యాయస్థానం పరిధిలోకి కూడా వెళ్లిందని చెప్పారు. పీఆర్సీ సాధన సమితి సభ్యులను మంత్రుల కమిటీ వద్దకు పంపించామని.. పీఆర్సీ జీవోలు వెనక్కి తీసుకోవాలని మంత్రులను కోరినట్లు వివరించారు. ఏపీ జీఈఎఫ్‌ సెక్రటరీ జనరల్‌ కృష్ణయ్య మాట్లాడుతూ.. 18 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ప్రయోజనం దృష్ట్యా పీఆర్సీపై ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. ఆత్మాభిమానం కోసం ఉద్యమం చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఈనెలకు పీఆర్సీ ఇవ్వకపోయినా పర్వాలేదని..  పాత వేతనాలు ఇవ్వాలని కోరారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని