AP PRC: కమిటీ 30శాతం సిఫార్సు చేస్తే.. 23శాతం ఇస్తారా?: వెంకట్రామిరెడ్డి

ఏపీ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పీఆర్సీ వల్ల ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు,

Updated : 30 Jan 2022 14:45 IST

కర్నూలు: ఏపీ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పీఆర్సీ వల్ల ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్సీకి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కర్నూలులో చేపట్టిన ఉద్యోగులు ఆందోళనల్లో జేఏసీ నేత హృదయరాజుతో పాటు వెంకట్రామిరెడ్డి పాల్గొని మాట్లాడారు. ‘‘ఆఫీసర్స్‌ కమిటీ 30శాతం జీతాలు పెంచాలని సిఫార్సు చేసింది. కమిటీ సిఫారసులు పక్కనపెట్టి 23శాతమే ఇస్తామంటున్నారు. ఉద్యోగులకు ఇంత తక్కువ వేతనాలు ఇవ్వడం న్యాయమేనా?’’అని వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు.

పీఆర్సీ కోసం ఉద్యోగ, ఉపాధ్యాయులు చేస్తున్న ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌, పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. శ్రీకాకుళంలో పీఆర్సీ కోసం సాధన సమితి ఆధ్వర్యంలో ఏపీ ఎన్జీవో హోమ్‌ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షా శిబిరానికి హాజరైన బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఉమ్మడి కార్యాచరణలో భాగంగా 13 జిల్లాల్లో నిరసనలు కొనసాగుతున్నాయన్నారు. నాలుగు జేఏసీలు న్యాయమైన ధర్మపోరాటం చేస్తున్నాయని ఆయన చెప్పారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని బొప్పరాజు డిమాండ్‌ చేశారు. దీక్షా శిబిరంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల సంఘాలు పాల్గొన్నాయి.

రివర్స్‌ పీఆర్సీ.. గుంటూరులో వెనక్కి నడిచి ఉద్యోగుల నిరసన

గుంటూరు కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగులు వరుసగా నాలుగో రోజూ రిలేదీక్షలు కొనసాగించారు. రివర్స్‌ పీఆర్సీ ఇచ్చారంటూ వెనక్కి నడిచి తమ నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని.. పాత జీతాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీక్షల్లో పాల్గొన్నవారికి భారీ ఎత్తున ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. పెద్ద ఎత్తున ఉద్యోగులు దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం ప్రకటించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు