APSRTC: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ ఛార్జీల పెంపు: ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ

గత రెండేళ్లుగా ఆర్టీసీకి అనేక ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. ఆర్టీసీ.. రోజుకు 61 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తోందని పేర్కొన్నారు.

Updated : 13 Apr 2022 16:19 IST

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీజిల్‌ ధరల పెరుగుదల నేపథ్యంలో డీజిల్‌ సెస్‌ రూపంలో బస్సు ఛార్జీలు పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఛార్జీల పెంపునకు సంబంధించి ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు మీడియాతో మాట్లాడారు. గత రెండేళ్లుగా ఆర్టీసీకి అనేక ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ.. రోజుకు 61 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తోందని పేర్కొన్నారు. డీజిల్‌ రేటు దాదాపు 60 శాతం పెరిగిందని.. రెండేళ్లుగా రూ.5,680 కోట్ల ఆదాయం తగ్గిందన్నారు. ప్రస్తుతం నష్టాలను భరించలేని పరిస్థితికి ఆర్టీసీ వచ్చిందని.. తప్పనిసరి పరిస్థితుల్లో టికెట్‌ ధరపై ఎలాంటి మార్పు చేయకుండా డీజిల్‌ సెస్‌ పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.

దీనిలో భాగంగా పల్లె వెలుగు బస్సులకు రూ.2 చొప్పున, ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు రూ.5 చొప్పున, హైఎండ్‌ (ఎసీ) బస్సులకు రూ.10 చొప్పున డీజిల్‌ సెస్ పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇది పూర్తిగా డీజిల్‌పై విధించే సెస్‌ మాత్రమేనని.. టికెట్‌ రివిజన్‌ కాదని ఆర్టీసీ ఎండీ స్పష్టం చేశారు. రేపటి నుంచి పల్లె వెలుగు బస్సులో కనిష్ఠ ఛార్జీ రూ.10గా ఉంటుందన్నారు. అలాగే పల్లె వెలుగు కనీస ఛార్జీ రూ.10కి అదనంగా రూ.2 (సెస్), రూ.1 (సేఫ్టీ సెస్) విధించనున్నట్లు చెప్పారు. చిల్లర సమస్య లేకుండా చేసేందుకు పల్లె వెలుగు బస్సుల్లో కనీస ఛార్జీ రూ. 13ను రూ.15కు రౌండ్ ఆఫ్ చేస్తున్నట్లు వివరించారు. డీజిల్‌ సెస్‌ వల్ల ప్రజలపై ఏడాదికి రూ.720 కోట్ల భారం పడుతుందని వెల్లడించారు. ప్రస్తుతం ఆర్టీసీకి నిర్వహణ ఖర్చులు కూడా రావడం లేదని.. తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రయాణికులపై భారం వేసినట్లు చెప్పారు. ఆర్టీసీలో నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలను లీజుకు ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్గో సేవల ద్వారా కూడా ఆదాయం పెంచుకుంటామన్నారు.

స్సు పాసుల ధరలూ పెరుగుతాయి..

‘‘టికెట్ రేటు 32శాతం పెంచితేనే ఆర్టీసీకి నష్టాలు రాకుండా ఉంటుంది. ప్రయాణికులపై భారం పడకూడదని అంతమేర పెంచడం లేదు. సెస్ వల్ల సంస్థకు రోజుకు రూ.2 కోట్లు రాబడి వస్తుంది. ప్రభుత్వ వాహనాలకు ఆర్టీసీ డీజిల్ పోయాలనే దానిపై ప్రతిపాదనలు సిద్ధంగా చేశాం. డీజిల్ ధర తగ్గితే సెస్‌ను తగ్గిస్తాం. డీజిల్ ధర పెరిగితే సెస్ పెంచడంపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. బస్సు పాసుల ధరలు కూడా పెరుగుతాయి. ప్రభుత్వం కార్మికులకు వేతనాలు ఇస్తుంది. సంస్థకు వచ్చే ఆదాయంలో కొంత ప్రభుత్వానికి  కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి ఎంత ఇవ్వాలనే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం సంస్థకు రోజుకు రూ. 12 కోట్లు నుంచి రూ.12.5 కోట్లు ఆదాయం వస్తుంది. ఇప్పటివరకు సీసీఎస్‌కు ఉన్న రూ.290 కోట్ల అప్పులు, జీపీఎఫ్‌కు ఉన్న అప్పులనూ తీర్చాం’’ అని తిరుమలరావు పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని