Archana Gautam: తితిదే సిబ్బంది, నటి అర్చనా గౌతమ్‌ మధ్య వాగ్వాదం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సిబ్బంది, నటి అర్చనా గౌతమ్‌ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సంబంధిత విజువల్స్‌ నెట్టింట వైరల్‌ మారాయి.

Updated : 05 Sep 2022 18:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సిబ్బంది, నటి అర్చనా గౌతమ్‌ (Archana Gautam) మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సంబంధిత విజువల్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. అక్కడి కొందరు సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారంటూ అర్చనా ఓ వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో సోమవారం మధ్యాహ్నం పోస్ట్‌ చేశారు. తాను వీఐపీ దర్శనం కోసం రూ. 10500 టికెట్‌ తీసుకున్నానని, దర్శనానికి ఇంత వసూలు చేయటం దారుణమని ఆమె ఆరోపించారు. సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

‘గ్రేట్‌ గ్రాండ్‌ మస్తీ’, ‘హసీనా పార్కర్‌’, ‘బారాత్‌ కంపెనీ’ తదితర హిందీ చిత్రాల్లో నటించిన అర్చన తెలుగులో ‘ఐపీఎల్‌: ఇట్స్‌ ప్యూర్‌ లవ్‌’ అనే సినిమా చేశారు. పలు ధారావాహికలు, వీడియో సాంగ్స్‌లోనూ ఆమె మెరిశారు. మోడల్‌ అయిన అర్చన 2018లో ‘మిస్‌ బికినీ ఇండియా’ టైటిల్‌ గెలుచుకున్నారు. ఈ ఏడాది జరిగిన ఉత్తర్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మేరఠ్‌లోని హస్తినాపుర్‌ నియోజకవర్గం నుంచి ఆమె కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు.

నిజమేంటో తేలింది : తితిదే

తమ ఉద్యోగులపై అర్చనా గౌతమ్‌ దాడి హేయమైన చర్య అని, అవాస్తవ ఆరోపణలతో  ఆమె ఉద్యోగులపైనే ఫిర్యాదు చేసిందని తితిదే పేర్కొంది. ఆమె ఆరోపణలు ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన శివకాంత్‌ తివారి, అర్చనాతోపాటు మరో ఏడుగురు ఆగస్టు 31న దర్శనం కోసం కేంద్ర సహాయమంత్రి నుంచి సిఫార్సు లేఖ తీసుకొచ్చారు. అదనపు ఈవో కార్యాలయంలో దర్శనం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ లేఖపై రూ. 300ల దర్శనం టికెట్లు మంజూరు చేస్తూ శివకాంత్‌ తివారికి చెందిన ఫోన్‌ నంబరుకు మెసేజ్‌ పంపారు. దాన్ని, వారు వినియోగించుకోలేదు. ఆ తర్వాత, శివకాంత్‌.. అదనపు ఈవో కార్యాలయానికి వెళ్లగా, అప్పటికే టికెట్లు తీసుకోవాల్సిన గడువు ముగిసిందని సంబంధిత సిబ్బంది తెలిపారు’’

‘‘శివకాంత్‌తోపాటు అర్చన ఆగ్రహంతో విచక్షణ కోల్పోయి కార్యాలయ సిబ్బందిని దుర్భాషలాడారు. సర్ది చెప్పబోయిన ఓ ఉద్యోగిపై చేయి చేసుకున్నారు. అదనపు ఈవో కార్యాలయ సిబ్బంది వారి వివరాలు తీసుకుని రెండోసారి రూ. 300ల టికెట్లు కేటాయించినా తీసుకునేందుకు నటి నిరాకరించారు. అనంతరం, టూ టౌన్‌ పోలీసు స్టేషన్‌లో తితిదే సిబ్బంది తనపై చేయి చేసుకుని దురుసుగా ప్రవర్తించారని తప్పుడు ఫిర్యాదు చేశారు. సీఐ.. సిబ్బందిని రమ్మని, విచారణ చేపట్టారు. సిబ్బంది సంఘటనకు సంబంధించి వీడియోను పోలీసు అధికారికి చూపించగా అర్చన దురుసుగా ప్రవర్తించారని స్పష్టమైంది. అక్కడి నుంచి నటి వెళ్లిపోయారు’’ అని తితిదే తెలిపింది. రూ. 10,500 విలువ గల టికెట్‌తో ఆగస్టు 1న వీఐబీ బ్రేక్‌ దర్శనం చేసుకోవచ్చని సిబ్బంది సలహా ఇచ్చారని, దాన్ని నటి.. టికెట్‌ కోసం సిబ్బంది రూ. 10 వేలు డిమాండ్‌ చేశారంటూ ఆరోపించారని తితిదే పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని