ఇది ఎగరని రఫేల్‌ విమానం

పంజాబ్‌కు చెందిన ఓ ఆర్కిటెక్ట్‌ రఫేల్‌ యుద్ధ విమానం డిజైన్‌తో ఓ వాహనాన్ని రూపొందించి ఔరా అనిపిస్తున్నారు. బతిండాకు చెందిన ఆర్కిటెక్ట్‌ రాంపాల్‌ బెహానివాల్‌ రఫేల్‌ యుద్ధ విమానం స్ఫూర్తితో అదే ఆకారంలో ఉన్న ఓ వాహనాన్ని రూపొందించారు....

Published : 06 Mar 2021 01:52 IST

పంజాబ్‌లోని ఆర్కిటెక్ట్‌ అద్భుత ఆవిష్కరణ

చండీగఢ్‌: విమానంలో విహరించాలన్నది ప్రతి సామాన్య మానవుడి కల. కానీ, ఆర్థిక స్థోమత అడ్డంకిగా మారి చాలా మందికి అది కలగానే మిగిలిపోతుంది. అలాంటి వారి కోరికను కొంతైనా నిజం చేసేందుకు వినూత్నంగా ప్రయత్నించారు పంజాబ్‌కు చెందిన ఓ ఆర్కిటెక్ట్‌. రఫేల్‌ యుద్ధ విమానం డిజైన్‌తో ఓ వాహనాన్ని రూపొందించి కొందరి కలను కొంతైనా నిజం చేస్తున్నారు. భటిండాకు చెందిన ఆర్కిటెక్ట్‌ రాంపాల్‌ బెహానివాల్‌ రఫేల్‌ యుద్ధ విమానం స్ఫూర్తితో అదే ఆకారంలో ఉన్న ఓ వాహనాన్ని రూపొందించారు. దానికి ‘పంజాబ్‌ రఫేల్‌’ అని పేరు పెట్టారు. ఈ వాహనాన్ని తయారు చేసేందుకు రూ.3 లక్షల వరకు ఖర్చయ్యిందని బేహానివాల్‌ తెలిపారు. ప్రస్తుతం ఈ వాహనాన్ని తాను ఏర్పాటుచేసుకున్న సాంస్కృతిక పార్కులో ప్రదర్శనకు ఉంచారు.

విమానం ఎక్కాలని కోరిక ఉన్నా ఆర్థిక స్థోమత సరిగా లేని వారి కలను కొంతైనా నిజం చేయడానికి ఈ వాహనాన్ని తయారు చేసినట్లు రాంపాల్‌ పేర్కొన్నారు. తాను రూపొందించిన ‘పంజాబ్‌ రఫేల్‌’ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యిందని, దీన్ని చూసేందుకు చాలా మంది తరలివస్తున్నట్లు చెప్పారు. గతంలో పనికిరాని తుక్కు నుంచి రైలింజన్‌ తయారు చేసినట్లు రాంపాల్‌ తెలిపారు. ఈ ఎగురలేని రఫేల్‌ 15-20 కిలోమీటర్ల వేగంతో రోడ్డు మీద ప్రయాణించగలదు. దీనిలో మారుతి కారు ఇంజిన్‌ను అమర్చారు. 4 చక్రాలతో ఉన్న వాహనంలో ముందు టైర్లు చిన్నవిగా, వెనక టైర్లు పెద్దవిగా ఉన్నాయి. వెనుక భాగంలో సింగిల్‌ సైలెన్సర్‌ను అమర్చారు. ఈ వాహనంలో ముగ్గురు కూర్చునేందుకు వీలుంది. యుద్ధ విమానంలో మాదిరి సీట్లను ఎత్తులో అమర్చారు. ఇది వెళుతున్నప్పుడు యుద్ధ విమానం నుంచి ఎలాంటి శబ్దం వస్తుందో అలాంటి శబ్దమే బయటకు వినిపిస్తుంది.

అంబాలా వైమానిక స్థావరానికి రఫేల్‌ యుద్ధ విమానాలు చేరుకున్నప్పుడు ఆ దృశ్యాలను చాలా సార్లు చూసినట్లు రాంపాల్‌ చెప్పారు. ఆ యుద్ధ విమానాలకు సంబంధించిన కొన్ని ఫొటోలు తీసుకొని మెకానిక్‌ కుల్‌దీప్ సింగ్‌, మరో మిత్రుడి సాయంతో ఈ వాహనాన్ని రూపొందించినట్లు తెలిపారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు రఫేల్‌ను పోలిన వాహనాన్ని తయారు చేసినట్లు వివరించారు. రాంపాల్‌ను చూస్తే గర్వంగా ఉందని, తాము కూడా పంజాబ్‌ రఫేల్‌లో ప్రయాణించాలని అనుకుంటున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని