Vijayawada: ఇంద్రకీలాద్రిపై అక్టోబరు 15 నుంచి దసరా ఉత్సవాలు

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఏర్పాట్లపై విజయవాడ దుర్గగుడి ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు సమీక్ష నిర్వహించారు.

Updated : 19 Sep 2023 16:44 IST

విజయవాడ: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లను అధికారులు, పాలక మండలి సభ్యులు సమీక్షించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఇతర దేవాలయాల నుంచి సిబ్బందిని తీసుకొచ్చి ఇక్కడ వినియోగిస్తామని దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. అంతేకాకుండా ఉత్సవాలు జరిగే 10 రోజల్లో విధులు నిర్వర్తించేందుకు ఒప్పంద ప్రాతిపదికన మరికొంత మంది సిబ్బందిని నియమిస్తున్నట్లు చెప్పారు.  అన్నదాన భవనాన్ని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 15 నుంచి 23వ తేదీ వరకు దసరా ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శన మివ్వనున్నారు.

  • అక్టోబర్‌ 15 - బాలా త్రిపురసుందరి
  • అక్టోబరు 16 - గాయత్రీ దేవి
  • అక్టోబరు 17 - అన్నపూర్ణ దేవి
  • అక్టోబరు 18 - మహాలక్ష్మి 
  • అక్టోబరు 19 - మహాచండీ
  • అక్టోబరు 20 - సరస్వతి
  • అక్టోబరు 21 - లలితా త్రిపుర సుందరి
  • అక్టోబరు 22 - దుర్గాదేవి
  • అక్టోబరు 23 - మహిషాసుర మర్దిని, మధ్యాహ్నం నుంచి శ్రీ రాజరాజేశ్వరి

వీవీఐపీ దర్శనానికి ప్రత్యేక స్లాట్లు : ఈవో

ఉత్సవాల సమయంలో వినాయకుడి గుడి నుంచి క్యూలైన్లు ప్రారంభమవుతాయని ఈవో భ్రమరాంబ తెలిపారు. ఎప్పటిలాగే ఐదు క్యూ లైన్లు ఉంటాయని చెప్పారు. ‘‘కేశ ఖండనకు 600 మంది సిబ్బంది ఉంటారు. భక్తులు నిలిచే ప్రదేశాలను గుర్తించి షెడ్లు వేస్తున్నాం. జట్లు స్నానాలకు షవర్లు ఏర్పాటు చేస్తున్నాం. 10 ప్రసాదం కౌంటర్లు ఉంటాయి. మోడల్‌ గెస్ట్‌హౌస్‌, స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌ల వద్ద కూడా ప్రసాదం కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. వీవీఐపీల దర్శనానికి స్లాట్లు కూడా నిర్ణయిస్తాం. ఉత్సవాల నిర్వహణకు రూ.7 కోట్లు కేటాయించాం. గతంలో లాగానే భక్తుల రద్దీ ఉంటుందని అనుకుంటున్నాం. దసరా ఉత్సవాలు జరిగిన 9 రోజులూ అంతరాలయ దర్శనం ఉండబోదు’’ అని భ్రమరాంబ మీడియాకు తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు