Italy: కంటికి కనిపించని కళాఖండాన్ని అమ్మేశారు..!

కళా ప్రపంచానికి హద్దులు ఉండవని మరోసారి నిరూపితమైంది. ఇప్పుడు ఇటలీకి చెందిన సాల్వటోర్‌ గారో విషయంలో అదే నిజమైంది. ఆయన ‘లో సోనో’(నేను) అనే పేరుతో రూపొందించానని చెబుతోన్న ఓ కళాఖండాన్ని 18,000 డాలర్లకు విక్రయించారు.

Published : 04 Jun 2021 22:56 IST

రోమ్‌: కళా ప్రపంచానికి హద్దులు ఉండవని మరోసారి నిరూపితమైంది. ఇప్పుడు ఇటలీకి చెందిన సాల్వటోర్‌ గారో విషయంలో అదే నిజమైంది. ఆయన ‘లో సోనో’(నేను) అనే పేరుతో రూపొందించానని చెబుతోన్న ఓ కళాఖండాన్ని 18,000 డాలర్లకు విక్రయించారు. ధర పరంగా చూసుకుంటే ఇది చెప్పుకునే విషయమేమీ కాకపోయినా.. ఆయన అమ్మింది ఓ అదృశ్య శిల్పాన్ని(Invisible Sculpture). ఈ విషయమే ఇప్పుడు ప్రపంచాన్ని ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ఈ మేరకు స్థానిక మీడియా వివరాలు వెల్లడించింది. 

కొద్ది రోజుల క్రితం సాల్వటోర్‌.. ‘లో సోనో’ను ఇటాలియన్ ఆక్షన్ హౌస్ ‘ఆర్ట్‌ రైట్‌’లో అమ్మకానికి ఉంచారు. ఆ అదృశ్య శిల్పం 6 నుంచి 8 వేల డాలర్లు పలుకుతుందని అక్కడి సిబ్బంది అంచనా వేశారు. కానీ అది మాత్రం 18,300 డాలర్లకు అమ్ముడైంది. ఈ సందర్భంగా దాని రూపకర్త సాల్వటోర్‌ మీడియాతో మాట్లాడారు. ‘నేను ఒక కళాఖండాన్ని ఖాళీ ప్రదేశంగా భావిస్తాను. ఆ ఖాళీ ప్రదేశం పూర్తిగా శక్తితో నిండి ఉంటుంది. ఒకవేళ మనం దాన్ని ఖాళీ చేస్తే అక్కడేమీ ఉండదు(నథింగ్). కానీ హైసన్‌బర్గ్ అన్‌సెర్టెయినిటీ నియమం ప్రకారం.. ఆ ఏమీలేని దగ్గర కూడా బరువు ఉంటుంది. మనం చూడలేని శక్తి అక్కడ ఉంటుంది. అది గాలి, ఆత్మతో తయారై ఉంటుంది. గాలి, ఆత్మతో కూడిన ఈ శిల్పాన్ని కృత్రిమ వెలుతురు, వాతావరణ నియంత్రణ లేని ప్రదేశంలో ఏర్పాటు చేయాలి’ అని చెప్పుకొచ్చారు. అలాగే తన కళను సమర్థించుకుంటూ.. ‘మనం ఎన్నడూ చూడని దేవుని ఆకృతిని తయారు చేయలేదా?’ అంటూ ఎదురు ప్రశ్నించారు. ఈ అదృశ్య శిల్పంలాంటి అంశాలు ఆయనకు కొత్తేం కాదు. ఫిబ్రవరిలో ఈ తరహాలోనే తన కళను ప్రదర్శించారు. 

నాన్‌ ఫంగిబుల్ టోకెన్స్(ఎన్‌ఎఫ్‌టీ)కు ప్రజాదరణ లభిస్తోన్న తరుణంలో అదృశ్య కళలు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్‌ఎఫ్‌టీలను డిజిటల్‌ ఆస్తులుగా చెప్పుకోవచ్చు. బ్లాక్‌ చెయిన్ టెక్నాలజీ ద్వారా వర్తకం చేసే వీలున్న ఈ డిజిటల్ ఆస్తులు నేడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ట్విటర్ సీఈఓ జాక్‌డోర్సే చేసిన తొలి ట్వీట్ రూ.21 కోట్లకు వేలంలో అమ్ముడుపోయినప్పుడు ఈ కాన్సెప్ట్ ప్రచారంలోకి వచ్చింది. వీటి ద్వారా ట్వీట్లు, చిత్రాలు, వీడియోలు.. ఇలా వేలానికి ఉంచిన వేటినైనా కొనుగోలు చేయొచ్చు. ఈ ప్రక్రియ అంతా జరిగేది డిజిటల్ ప్రపంచంలో మాత్రమే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని