Delhi liquor scam: మద్యం కుంభకోణం కేసు.. అరుణ్‌ పిళ్లై ఈడీ కస్టడీ పొడిగింపు

దిల్లీ మద్యం కుంభకోణం (Delhi Liquor Scam) కేసులో అరెస్టయిన అరుణ్‌ పిళ్లై (Arun Ramachandra pillai) ఈడీ కస్టడీని మరో 3 రోజుల పాటు పొడిగిస్తూ రౌస్‌ అవెన్యూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.

Updated : 13 Mar 2023 17:13 IST

దిల్లీ: మద్యం కుంభకోణం కేసు (Delhi Liquor Scam)లో అరెస్టయిన అరుణ్ రామచంద్రపిళ్లై (Arun Ramchandra pillai) కస్టడీని  పొడిగించాలన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అభ్యర్థనను న్యాయస్థానం అంగీకరించింది. మరో మూడు రోజులపాటు ఈడీ కస్టడీని పొడిగిస్తూ రౌస్‌ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిళ్లై కస్టడీని పొడిగించాలంటూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది. ఇప్పటికే పిళ్లైను ఈడీ అధికారులు 29 సార్లు విచరణకు పిలిచి 11 సార్లు స్టేట్ మేంట్ రికార్డు చేశారని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. పిళ్లై ఇప్పటికే విచారణకు అన్ని విధాలా సహకరించారని.. కేసు విచారణకు 36 సార్లు హాజరయ్యారని కోర్టుకు వివరించారు. ఒకవేళ ఇతర నిందితులతో కలిపి పిళ్లైను ప్రశ్నిస్తే విచారణలో న్యాయవాది ఉండాలని పేర్కొన్నారు. హోటల్‌ రికార్డులతో లిక్కర్‌ కేసు ఆపాదించాలని చూస్తున్నారన్నారు. 

అనంతరం ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. చాలా కీలక సమయంలో వాంగ్మూలం ఉపసంహరణ కోసం అప్లికేషన్‌ దాఖలు చేశారన్నారు. పిళ్లై విచారణకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ, ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు. విచారణ సమయంలో పిళ్లైతో పాటు అతని న్యాయవాదికి అనుమతి ఇవ్వాలన్న వాదనలకు వ్యతిరేకించారు. ఇప్పుడు స్టేట్‌మెంట్‌ వెనక్కి తీసుకుంటామంటున్నారని.. కానీ బలవంతం చేసి పిళ్లై వాంగ్మూలం తీసుకోలేదని స్పష్టం చేశారు. వాంగ్మూలం రికార్డ్‌ చేసేందుకు అన్ని నిబంధనలు పాటించామని వివరించారు. భయపెట్టి, బలవంతం చేసి వాంగ్మూలం తీసుకోలేదన్నారు. మొదటిసారి గతేడాది సెప్టెంబరు 18న పిళ్లై స్టేట్‌ మెంట్‌ రికార్డు చేశామని తెలిపారు. ముడుపుల వ్యవహారంలో పిళ్లైది ప్రధాన పాత్ర పోషించారని కోర్టుకు స్పష్టం చేశారు. 

పిళ్లై, బుచ్చిబాబు కలిసి లిక్కర్‌ పాలసీ రూపకల్పనలో భాగస్వాములుగా ఉన్నారని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. బుచ్చిబాబు ఇచ్చిన సమాచారం ఆధారంగా పిళ్లైను, బుచ్చిబాబును కలిపి ప్రశ్నించాల్సి ఉందని ఈడీ పేర్కొంది. న్యాయవాదుల సమక్షంలో పీఎంఎల్‌ఏ సెక్షన్‌ 50 ప్రకారం నిందితుల విచారణ జరగదని స్పష్టం చేసింది. 2022 సెప్టెంబరు 18న పూర్తి స్టేట్‌మెంట్‌ నమోదు చేశామని తెలిపారు. రెండు, మూడో దఫా ఇచ్చిన వాంగ్మూలంలో కూడా వివరాలను ఖరారు చేశారని తెలిపింది. ఆయనను టార్చర్‌ చేస్తే మిగిలిన స్టేట్‌మెంట్లలో అవే విషయాలను ఎలా కన్ఫర్మ్ చేస్తారని ఈడీ ప్రశ్నించింది. మార్చి తర్వాతే స్టేట్‌మెంట్‌ మార్చుకున్నారన్న ఈడీ.. అలా ఎందుకు చేశారో తెలుసని తెలిపింది. బలమైన వ్యక్తిని విచారణకు పిలిచినప్పుడు పిళ్లై తన స్టేట్‌మెంట్‌ మార్చుకున్నారని వివరించింది. ఈడీ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం పిళ్లై కస్టడీని మరో 3 రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 15న ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్‌ బుచ్చిబాబుతో కలిసి పిళ్లైని ఈడీ ప్రశ్నించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు