మనసు దోచుకుంటున్న ‘అరుణాచల్‌’ అందాలు!

ప్రకృతిని ఆస్వాదించాలనుకునే వారికి అరుణాచల్‌ప్రదేశ్‌ మంచి వేదికగా నిలుస్తోంది. ఇక్కడ సహజసిద్ధమైన అందాలతో పాటు వెదురు బొంగులతో నిర్మించిన వంతెనలు ఉన్నాయి.

Published : 20 Aug 2020 22:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రకృతిని ఆస్వాదించాలనుకునే వారికి అరుణాచల్‌ప్రదేశ్‌ మంచి వేదికగా నిలుస్తోంది. ఇక్కడ సహజ సిద్ధమైన అందాలతో పాటు వెదురు బొంగులతో నిర్మించిన వంతెనలు ఆకట్టుకుంటున్నాయి. దేశంలోనే 300మీటర్ల పొడవైన సింగిల్‌ లేన్ స్టీల్‌ కేబుల్ సస్పెన్షన్‌ వంతెన కూడా ఇక్కడ ఉంది. దేశంలోని అందమైన ఈశాన్య రాష్ట్రాల్లో అసోం, మేఘాలయతో పాటు అరుణాచల్‌ప్రదేశ్‌ ఒకటి.

 

ఈ ప్రాంతంలో ప్రకృతిసిద్ధమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. పర్యాటక ప్రాంతాలను సందర్శించాలి అనుకునే వారికి ఈ రాష్ట్రం మంచి ఎంపిక. ప్రపంచానికి తెలియని ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడి సింగిల్‌ లేన్‌ స్టీల్‌ కేబుల్‌ సస్పెన్షన్‌ వంతెన పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. యమునా నదిపై వెదురు బొంగులతో నిర్మించిన వంతెన కూడా ఇక్కడికి వచ్చే పర్యాటకుల మనసు దోచుకుంటోంది. దీన్ని కర్రలు ,తాళ్లతో రూపొందించారు. మనుషులు నడవడం కోసం నడి భాగంలో వెదురు బొంగుల అమరికలను పేర్చారు. ఈ వంతెనను గిరిజనుల సంస్కృతికి చిహ్నంగా అభివర్ణిస్తారు. సుమారు 1000 అడుగుల పొడవు గల ఈ వంతెనను గిరిపుత్రులు తమ రోజువారీ కార్యకలాపాల కోసం వినియోగిస్తారు. వంతెనపై వెళ్లేటప్పుడు నది ప్రవాహాన్ని చూస్తే అందులోని రకరకాల చేపలు ఎగురుతున్న సుందరమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి. నది పరీవాహక ప్రాంతంలో ఉన్న సుమారు 20వేల మందికి వంతెన ఎంతో ఉపయోగపడటమే కాకుండా రక్షణను కల్పిస్తోంది. ఈ రెండు వంతెనలు ఇక్కడి ప్రజలకు ప్రధాన రవాణా మార్గంగా ఉపయోగపడుతున్నాయి. ఈ ప్రాంత ప్రజలు ఎక్కువగా అటవీ వృక్షాలు, పండ్లు, ఇతర వాటిపై ఆధారపడి జీవిస్తుంటారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని