ATM: రూ.500 కొడితే రూ.2500.. ఏటీఎం కేంద్రానికి ఎగబడ్డ జనం!

విత్‌డ్రా చేయాలనుకున్న మొత్తానికి అయిదు రెట్లు ఎక్కువ నగదు వస్తుండటంతో.. మహారాష్ట్రలోని ఓ ఏటీఎం(ATM) కేంద్రానికి వినియోగదారులు ఎగబడ్డారు. నాగ్‌పుర్ జిల్లా ఖాపర్‌ఖేడా పట్టణంలోని ఓ ప్రైవేటు బ్యాంకు ఏటీఎం కేంద్రంలో...

Updated : 16 Jun 2022 15:10 IST

ముంబయి: విత్‌డ్రా చేయాలనుకున్న మొత్తానికి అయిదు రెట్లు ఎక్కువ నగదు వస్తుండటంతో.. మహారాష్ట్రలోని ఓ ఏటీఎం(ATM) కేంద్రానికి వినియోగదారులు ఎగబడ్డారు. నాగ్‌పుర్ జిల్లా ఖాపర్‌ఖేడా పట్టణంలోని ఓ ప్రైవేటు బ్యాంకు ఏటీఎం కేంద్రంలో ఈ వ్యవహారం వెలుగుచూసింది. బుధవారం ఓ వ్యక్తి ఈ ఏటీఎంలో రూ.500 విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించారు. అయితే.. రూ.500 బదులు.. రూ.500 విలువైన అయిదు కరెన్సీ నోట్లు రావడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు! మరోసారి అదే విధంగా చేయగా.. మళ్లీ రూ.2,500 వచ్చాయి. దీంతో స్థానికంగా ఈ విషయం ఒక్కసారిగా దావానలంలా వ్యాపించింది.

వెంటనే నగదు ఉపసంహరణ కోసం స్థానికులు పెద్దఎత్తున ఏటీఎం వద్ద గుమిగూడారు. ఈ క్రమంలోనే బ్యాంకు ఖాతాదారుల్లో ఒకరు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు అక్కడికి చేరుకుని ఏటీఎం కేంద్రాన్ని మూసివేశారు. అనంతరం బ్యాంకు సిబ్బందికి ఈ మేరకు సమాచారం అందించారని ఖాపర్‌ఖేడా పోలీస్‌స్టేషన్‌ అధికారి తెలిపారు. రూ.100 విలువైన నోట్లను ఉంచాల్సిన ట్రేలో రూ.500 నోట్లను తప్పుగా జమ చేయడంతో అధికంగా డబ్బులు విత్‌డ్రా అయినట్లు చెప్పారు. మరోవైపు బ్యాంకు అధికారులు.. ఎవరెవరు ఎంతమొత్తంలో నగదు తీసుకున్నారో ఆరా తీసే పనిలో పడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని