Krishna Tribunal: కొత్త కృష్ణా ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలా? వద్దా?.. అభిప్రాయం వెల్లడించని ఏజీ

కొత్త కృష్ణా ట్రైబ్యునల్‌ ఏర్పాటుపై అభిప్రాయం తెలిపేందుకు అటార్నీ జనరల్‌ వెంకటరమణి విముఖత వ్యక్త చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆ దస్త్రాన్ని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు పంపింది.

Updated : 03 Feb 2023 15:58 IST

దిల్లీ: కొత్త కృష్ణా ట్రైబ్యునల్‌ (Krishna Tribunal) ఏర్పాటుపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలా? వద్దా? అనే దానిపై అభిప్రాయం తెలిపేందుకు అటార్నీ జనరల్‌ (Attorney general) వెంకటరమణి నిరాకరించారు. కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటుపై గతంలోనే ఏజీ అభిప్రాయాన్ని కేంద్రం కోరింది. అయితే, ఏజీగా ఆయన బాధ్యతలు చేపట్టక ముందు.. సీనియర్‌ న్యాయవాదిగా ఏపీ ప్రభుత్వం తరఫున కొన్ని కేసుల్లో హాజరైనందున తన అభిప్రాయాన్ని చెప్పలేనని స్పష్టం చేశారు. దీంతో ఆ ఫైల్‌ను సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు కేంద్రం పంపింది.

రాష్ట్ర విభజన తర్వాత.. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీకి కొత్త ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాతే బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పును నోటిఫై చేయాలంటూ సుప్రీంకోర్టులో తెలంగాణ పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటే కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని కేంద్రం పలుమార్లు పేర్కొంది. కేంద్రం హామీ మేరకు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ ఉపసంహరించుకుంది. కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని తొలుత కేంద్ర న్యాయశాఖ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఉన్న బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌తోనే విచారిస్తే సరిపోతుందని అభిప్రాయపడింది. దీనిపై అటార్నీ జనరల్‌ అభిప్రాయం ప్రకారం ముందుకెళ్లాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఏజీ అభిప్రాయాన్ని కోరింది. ఇందుకు ఏజీ విముఖత చూపడంతో ఆ దస్త్రాన్ని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు కేంద్రం పంపింది. తుషార్‌ మెహతా అభిప్రాయం తర్వాత కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటుపై కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని