Viveka Murder Case: ముందస్తు బెయిల్‌ ఇవ్వండి.. హైకోర్టును ఆశ్రయించిన అవినాష్‌రెడ్డి

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి(MP Avinash Reddy) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు(Viveka Murder Case)లో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరారు. 

Updated : 28 Mar 2023 17:57 IST

హైదరాబాద్‌: కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి(MP Avinash Reddy) తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు(Viveka Murder Case)లో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరారు. ఇప్పటికే అవినాష్ రెడ్డిని పలు సార్లు సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ నేతృత్వంలో అధికారులు విచారించిన విషయం తెలిసిందే.  ఇదే కేసుకు సంబంధించి గతంలోనే అవినాష్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. అరెస్టు చేయవద్దని తాము ఆదేశాలు ఇవ్వలేమని ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. త్వరలోనే సీబీఐ అధికారులు అవినాష్‌రెడ్డిని విచారణకు పిలిచే అవకాశముందని ప్రచారం  జరుగుతోంది. ఈ నేపథ్యంలో తనను అరెస్టు చేసే అవకాశమున్నందున.. ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని ఆయన పిటిషన్‌లో కోరినట్టు సమాచారం.

వివేకా హత్యకేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కేసును ఇంకెంత కాలం విచారిస్తారని సీబీఐపై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. హత్యకు గల ప్రధాన కారణాలు, ఉద్దేశాలు బయటపెట్టాలని ధర్మాసనం పేర్కొంది. ‘విచారణాధికారిని మార్చండి లేదా ఇంకో అధికారిని నియమించండ’ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అవసరమైతే ఇప్పుడున్న అధికారిని కొనసాగించండని పేర్కొంది. సీబీఐ దాఖలు చేసిన సీల్డ్‌ కవర్‌ నివేదిక ఆసాంతం చదివామని ధర్మాసనం పేర్కొంది. కేసు అంతా.. రాజకీయ శత్రుత్వంతో జరిగిందని రిపోర్ట్‌లో రాశారని న్యాయమూర్తి పేర్కొన్నారు. మెరిట్స్‌ మీద ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. సీబీఐ డైరెక్టర్‌ నుంచి తగిన ఆదేశాలు తీసుకోవాలని పేర్కొన్న ధర్మాసనం.. కేసు విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈక్రమంలో సీబీఐ విచారణ వేగవంతం కానుండటంతో అవినాష్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని