Avinash Reddy: వివేకా హత్యకేసులో 8వ నిందితుడిగా అవినాష్‌రెడ్డి: సీబీఐ

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు భాస్కర్‌రెడ్డి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం సీబీఐ కోర్టు తీర్పు వెలువరించనుంది. 

Updated : 08 Jun 2023 21:46 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు భాస్కర్‌రెడ్డి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం సీబీఐ కోర్టు తీర్పు వెలువరించనుంది. భాస్కర్‌రెడ్డికి బెయిల్‌ ఇవ్వొద్దని ఈనెల 5న దాఖలు చేసిన కౌంటర్‌లో సీబీఐ పలు కీలక విషయాలు ప్రస్తావించింది.

వైఎస్‌ అవినాష్‌రెడ్డిని ఈ కేసులో సీబీఐ ఎనిమిదో నిందితుడిగా చేర్చింది. గతంలో దాఖలు చేసిన కౌంటర్‌లో అవినాష్‌రెడ్డిని సహనిందితుడిగా పేర్కొన్నారు తప్ప ఎక్కడా కూడా నిందితుడిగా చెప్పలేదు. కానీ, ఈనెల 5న దాఖలు చేసిన కౌంటర్‌లో మాత్రం ఏ8గా సీబీఐ ప్రస్తావించింది. వివేకా హత్యకు కుట్ర, సాక్ష్యాలను చెరిపివేయడంలో వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి ప్రమేయం ఉందని, దీనికి సంబంధిత ఆధారాలు తమ వద్ద ఉన్నాయని సీబీఐ పేర్కొంది. కేసును పక్కదారి పట్టించే విధంగా, సాక్షులను ప్రభావితం చేసేందుకు భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి అడుగడుగునా ప్రయత్నిస్తున్నారని సీబీఐ పేర్కొంది.

వివేకా పీఏ చెప్పకముందే జగన్‌కు తెలుసు..

ఎన్‌.శివశంకర్‌రెడ్డి ఫోన్‌ చేసిన నిమిషంలోనే అవినాష్‌రెడ్డి హత్యాస్థలికి చేరారు. ఉదయం 5.20కి ముందే అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డితో గంగిరెడ్డి మాట్లాడినట్టు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. కేసు పెట్టొద్దని, పోస్టుమార్టం వద్దని సీఐ శంకరయ్యకు అవినాష్‌, శివశంకర్‌రెడ్డి చెప్పారు. సీబీఐకి, కోర్టుకు ఏమీ చెప్పొద్దని దస్తగిరిని ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు. దస్తగిరిని ప్రలోభ పెట్టేందుకు అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి అనేక ప్రయత్నాలు చేశారు. వివేకా హత్య విషయం సీఎం జగన్‌కు ఉదయం 6.15కి ముందే తెలుసని సీబీఐ పునరుద్ఘాటించింది. వివేకా పీఏ బయటకు చెప్పకముందే జగన్‌కు తెలుసని దర్యాప్తులో గుర్తించామని సీబీఐ పేర్కొంది. ఈ దశలో భాస్కర్‌రెడ్డికి బెయిల్‌ ఇస్తే దర్యాప్తును, కీలక సాక్షులను ప్రభావితం చేస్తారు. కడప, పులివెందుల ప్రాంతాల్లో భాస్కర్‌రెడ్డి చాలా ప్రభావితం చేయగల వ్యక్తి. అతన్ని అరెస్టు చేసినప్పుడు కడపలో జరిగిన ధర్నాలు, ప్రదర్శనలే భాస్కర్‌రెడ్డి బలానికి నిదర్శనం. భాస్కర్‌రెడ్డి బయట ఉంటే చాలు పులివెందులలో సాక్షులు ప్రభావితమైనట్లే. భాస్కర్‌రెడ్డికి బెయిల్‌ ఇచ్చి ఎన్ని షరతులు పెట్టినా నిరుపయోగమే. సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేస్తే కేసుకు పూడ్చలేని నష్టం. దర్యాప్తునకు సహకరించానని భాస్కర్‌రెడ్డి చెప్పడం అబద్ధం. కడప ఎస్పీ సమాచారం మేరకు భాస్కర్‌రెడ్డిపై గతంలో 3 కేసులున్నాయి.

పేలుడు పదార్థాల చట్టం సహా 3 కేసులు గతంలో ఉన్నట్టు ఎస్పీ తెలిపారు. ఇందులో రెండు కేసులు వీగిపోగా, మరొకటి తప్పు కేసుగా తేల్చి కొట్టివేశారు. కేసుల ప్రకారం భాస్కర్‌రెడ్డి నేపథ్యం ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. వివేకా హత్యకేసులో ప్రమేయాన్ని చూసినా.. భాస్కర్‌రెడ్డి నేపథ్యం ప్రశ్నార్థకమే. ఏప్రిల్‌16 నుంచి జైల్లో ఉన్నంత మాత్రాన బెయిల్‌కు కారణం కారాదు. దస్తగిరి విషయంలో దర్యాప్తు నిష్పక్షపాతంగానే ఉంది. దస్తగిరికి కడప కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దస్తగిరిని అరెస్టు చేసి రూ.20వేలు, ఇద్దరి పూచీకత్తుతో బెయిల్‌పై విడుదల చేశాం. రక్తం మరకలు తుడవక ముందే ఫొటోలు, వీడియో తీశారు కాబట్టి సాక్ష్యాలకు ఆటంకం లేదన్న వాదన సరికాదు. బెయిల్‌ సమయంలోనే సాక్ష్యాలను లోతుగా పరిశీలించడం తగదు. ప్రస్తుత దశలో సాక్ష్యాలను పరిశీలించడం ప్రాసిక్యూషన్‌కు నష్టం అని సీబీఐ వెల్లడించింది.

భాస్కర్‌రెడ్డికి బెయిల్‌ ఇవ్వొద్దు: సునీత

వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి బెయిల్‌ ఇవ్వొద్దని వివేకా కుమార్తె సునీత కోరారు. ఈమేరకు సీబీఐ కోర్టులో లిఖితపూర్వక వాదనలు సమర్పించారు. వివేకా హత్యకేసు లోతుగా దర్యాప్తు జరగాల్సి ఉందని, భాస్కర్‌రెడ్డికి బెయిల్‌ ఇస్తే సాక్షులను, దర్యాప్తును ప్రభావితం చేస్తారని కోర్టుకు తెలిపారు. భాస్కర్‌రెడ్డి ప్రమేయంపై పలువురు సాక్షుల వాంగ్మూలాలు ప్రస్తావించారు. మరో వైపు వివేకా హత్యకేసులో సీబీఐ న్యాయవాదికి సాయం చేసేలా అనుమతించాలని సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. తీర్పును ఈనెల 16కు సీబీఐ కోర్టు వాయిదా వేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని