Viveka Murder Case: విచారణకు హాజరుకాలేను.. సీబీఐకి అవినాష్‌రెడ్డి లేఖ

పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో రేపటి విచారణకు హాజరు కాలేనంటూ కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐకి లేఖ రాశారు.

Updated : 13 Mar 2023 22:34 IST

అమరావతి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. పార్లమెంట్‌ సమావేశాల దృష్ట్యా రేపటి విచారణకు హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు మినహాయింపు ఇవ్వాలని సీబీఐని కోరారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగే విచారణకు రావాలని ఈ నెల 10న తెలంగాణ హైకోర్టు అవినాష్‌రెడ్డిని ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై న్యాయస్థానం సూచనలు తీసుకున్న అవినాష్‌ ఈ మేరకు సీబీఐకి లేఖ రాశారు.

తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా సీబీఐ (CBI)ని ఆదేశించాలని కోరుతూ కడప ఎంపీ అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో మార్చి 10న విచారణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తీవ్రమైన చర్యలంటే ఏంటని న్యాయస్థానం ప్రశ్నించింది. అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని అడుగుతున్నారా? అని వ్యాఖ్యానించింది. దీనిపై అవినాష్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. చెప్పింది చెప్పినట్లు సీబీఐ అధికారులు వాంగ్మూలం నమోదు చేస్తున్నారనే నమ్మకం తమకు లేదని కోర్టుకు తెలిపారు. దీనిపై సీబీఐ తరఫు న్యాయవాది స్పందిస్తూ విచారణను వీడియో రికార్డింగ్‌ చేస్తున్నామని వెల్లడించారు.

ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం. వీడియో రికార్డింగ్‌ ఏ దశలో ఉందో తెలపాలని సీబీఐని ఆదేశించింది. మంగళవారం అవినాష్‌రెడ్డిని మళ్లీ విచారణకు పిలుస్తామని హైకోర్టుకు సీబీఐ తెలిపింది. విచారణ సందర్భంగా న్యాయవాదిని కూడా అనుమతించాలని అవినాష్‌ తరఫు న్యాయవాది కోరగా..హైకోర్టు అంగీకరించింది. ఈనెల 14న ఉదయం 11గంటలకు విచారణకు హాజరు కావాలని అవినాష్‌రెడ్డిని న్యాయస్థానం ఆదేశించింది. అయితే, పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో తాను హాజరుకాలేనని, మినహాయింపు ఇవ్వాలని కోరుతూ తాజాగా అవినాశ్‌రెడ్డి సీబీఐకి లేఖ రాశారు.

సీబీఐ నుంచి రాని సమాధానం

ఏంపీ అవినాష్‌ రెడ్డి లేఖపై సీబీఐ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో  రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరవ్వాలని అవినాష్‌ రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు