నిద్రపట్టకపోవడానికి కారణాలివేనట

ఒకప్పుడు ప్రజలు చీకటి పడగానే తినేసి హాయిగా నిద్రపోయేవారట. కానీ, కాలంతోపాటు నిద్రపోయే సమయం మారిపోయింది. ఆధునిక నైట్‌ కల్చర్‌, వృత్తులు, అలవాట్ల కారణంగా ఇప్పుడు చాలా మందికి అర్ధరాత్రి 12 దాటినా నిద్రపట్టట్లేదు. ఒకవేళ నిద్ర పట్టినా కొన్నిసార్లు హఠాత్తుగా

Updated : 29 Aug 2020 10:55 IST

ఒకప్పుడు ప్రజలు చీకటి పడగానే తినేసి హాయిగా నిద్రపోయేవారు. కానీ, కాలంతోపాటు నిద్రపోయే సమయం మారిపోయింది. ఆధునిక నైట్‌ కల్చర్‌, వృత్తులు, అలవాట్ల కారణంగా ఇప్పుడు చాలా మందికి అర్ధరాత్రి 12 దాటినా నిద్రపట్టట్లేదు. ఒకవేళ నిద్ర పట్టినా కొన్నిసార్లు హఠాత్తుగా మెలుకువ వచ్చేస్తోంది. దీంతో ప్రశాంతమైన నిద్ర కరవవుతోంది. ఈ కరోనా సంక్షోభంలో ఈ సమస్య మరింత పెరిగింది. అయితే ఎందుకిలా జరుగుతోంది? దీనికి కారణాలేంటని కొందరు పరిశోధకులు సర్వే నిర్వహించారు. 22 దేశాల నుంచి 69వేల మందిపై సర్వే నిర్వహిస్తే ముఖ్యంగా ఏడు కారణాలు ఉన్నాయని తేలింది. అవేంటో చూద్దాం.


కెఫీన్‌తో జాగ్రత్త

ఇంట్లో.. ఆఫీసుల్లో చాలా మంది కాఫీ, టీ తాగుతుంటారు. పగటిపూట నిద్ర మత్తు ఉన్నప్పుడు వీటిని ఎక్కువగా తాగుతారు. వాటిలో ఉండే కెఫీన్‌ మనిషి నిద్రమత్తును పోగొట్టి ఉత్తేజంగా మారుస్తుంది. ఆ తాత్కాలికంగా నిద్రమత్తును వదిలించుకోవడం కోసం తీసుకునే కెఫీన్‌ నిద్రపోయే సమయంపై కూడా ప్రభావం చూపుతుంది. 54.4శాతం మంది కాఫీ కారణంగా నిద్రపట్టట్లేదని చెప్పారట. కాబట్టి పడుకునే ముందు కాఫీ వంటివి తాగకండి.


ఒంటరిగా అనిపించడం

చాలా మందికి నిద్రపోయే సమయంలో ఒంటరితనం వెంటాడుతోందట. దాని వల్లే నిద్రరావట్లేదని 54శాతం మంది సర్వేలో చెప్పారు. 18-24 ఏళ్లు ఉన్న వారిలో 38శాతం మంది ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారట. 65 ఏళ్లు పైబడిన ఒక శాతం మంది మాత్రమే ఒంటరితనం వల్ల నిద్రరావట్లేదని తెలిపారు.


డిజిటల్‌ టెక్నాలజీ

ఈ సర్వే ప్రకారం 53.4 శాతం మంది ప్రజలు వారికి నిద్రపట్టకపోవడానికి కారణం డిజిటల్‌ టెక్నాలజీ అని వెల్లడించారట. రాత్రి తిని పడుకునేటప్పుడు చాలా మంది మొబైల్‌లో తమకు నచ్చిన ప్రొగ్రామ్స్‌, వీడియోలు చూస్తూ.. నిద్రపోవాలన్న విషయమే మర్చిపోతున్నారు. ఎప్పటికో కళ్లు అలిసిపోయి నిద్రకు ఉపక్రమించినా మధ్యలో మెలుకువ వచ్చి నిద్రా భంగం కలుగుతుంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే పడుకునేముందు మొబైల్‌ను దూరంగా పెట్టి పడుకుంటే మంచిది.


ఆర్థిక పరిస్థితులు

సాధారణంగానే ఆర్థిక పరిస్థితులు మనిషికి మానసిక ఒత్తిళ్లను తెచ్చిపెడతాయి. ఇక ఈ కరోనా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో అనేక మంది ఉపాధి లేక, ఉద్యోగాలు కోల్పోయి కుటుంబ పోషణ ఎలా అన్న విషయంపై తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ క్రమంలో వారికి నిద్రే కరవవుతోంది. 49.8శాతం మంది ప్రజలు ఆర్థిక ఒత్తిళ్ల వల్లే నిద్ర పట్టట్లేదని ఈ సర్వేలో వాపోయారు. 25-45 ఏళ్ల మధ్య వయస్కులు ఉద్యోగ భద్రత, ఆర్థిక కష్టాలే నిద్రపట్టకపోవడానికి ప్రథమ కారణమని చెప్పారట. 


అనారోగ్యంపై ఆలోచన

అనారోగ్యం పాలవుతున్నామని తెలిసినా లేదా కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురైనా ఆ ఆందోళనే మనిషికి నిద్ర పట్టకుండా చేస్తోందట. కాస్త నలతగా ఉన్నా కరోనా సోకుతుందేమోనని భయపడుతున్నారట. ఈ కారణంగానే నిద్ర రావట్లేదని 46.4శాతం మంది వెల్లడించారట. ఇలాంటి ధోరణి 35 ఏళ్లు పైబడిన వారిలోనే ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో తేలింది.


వార్తలూ కారణమవుతున్నాయట

డిజిటల్‌ టెక్నాలజీతో ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో ఆ వార్త తెలుసుకోగలుతున్నాం. మంచి, చెడు, నిజం, అబద్ధం ఇలా అన్ని రకాల వార్తలు బుర్రలోకి ఎక్కించుకోవడంతో మానసిక ఒత్తిడి పెరుగుతోందని 46.4శాతం మంది పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ సమస్యను 18-44 ఏళ్ల మధ్య వయస్కులు ఎదుర్కొంటున్నారట.


మద్యం తాగితే నిద్రపట్టట్లేదట

చాలా మంది మద్యం ఎక్కువ తాగితే నిద్ర వస్తుందని అపోహ పడతారు. నిజానికి మద్యం సేవించడం మూలంగా నిద్ర పట్టదు. ఆ మత్తులో తూగుతుంటారంతే. ప్రశాంతమైన నిద్ర ఉండదు. 44.6శాతం మంది అధికంగా మద్యం తాగినా నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నామని సర్వేలో తెలిపారట. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు