Bandi sanjay: మాల్‌ప్రాక్టీస్‌ కేసు.. బండి సంజయ్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ కొట్టివేత

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను హనుమకొండ జిల్లా కోర్టు కొట్టివేసింది.

Updated : 27 Apr 2023 20:01 IST

హనుమకొండ: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఊరట లభించింది. తనకు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను హనుమకొండ జిల్లా కోర్టు కొట్టివేసింది. పదో తరగతి ప్రశ్నపత్రం మాల్‌ప్రాక్టీస్‌ కేసులో బండి సంజయ్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 

సంజయ్‌కు ఏప్రిల్‌ 6న బెయిల్‌ మంజూరైంది. అయితే, సంజయ్‌ బెయిల్‌ షరతులు ఉల్లంఘిస్తున్నారని, ఆయనకు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు ఈనెల 17న పిటిషన్‌ దాఖలు చేశారు. హనుమకొండ జిల్లా నాలుగో అదనపు మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు న్యాయమూర్తి మట్ట సరిత ఇరుపక్షాల వాదనలను మంగళవారం విన్నారు. తదుపరి వాదనల కోసం కేసును బుధవారానికి వాయిదా వేశారు. బుధవారం ఇరువర్గాల నుంచి ఎలాంటి వాదనలు లేకపోవడంతో తీర్పు వెల్లడిని గురువారానికి వాయిదా వేశారు. బెయిల్‌ రద్దుకు సహేతుక కారణాలు లేవని సంజయ్‌ తరఫు న్యాయవాది ఎల్‌.రవిచందర్‌ వాదనలు వినిపించారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం పోలీసుల పిటిషన్‌ను కొట్టివేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని