Bandi Sanjay: కచ్చితంగా సభకు వెళ్లి తీరుతా: బండి సంజయ్‌

బైంసాలో సోమవారం నిర్వహించబోయే సభకు కచ్చితంగా వెళ్తానని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. నిర్మల్‌ వెళ్తున్న తనను పోలీసులు అడ్డుకోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 28 Nov 2022 01:43 IST

నిర్మల్‌:  ప్రజా సంగ్రామ యాత్ర కోసం నిర్మల్‌ వెళ్తున్న తనను అడ్డుకోవడంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. భైంసాలో నిర్వహించే సభకు సోమవారం కచ్చితంగా వెళ్లి తీరుతానని తేల్చి చెప్పారు. అవసరమైతే న్యాయస్థానం తలుపులు తడతామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంత పాలనకు ఇదే నిదర్శనమని ఆరోపించారు. ప్రజాస్వామ్య బద్ధంగా పాదయాత్రకు వెళ్తుంటే అడ్డుకుంటారా? అని ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పాదయాత్రకు తొలుత అనుమతిచ్చి ఇప్పుడు హఠాత్తుగా రద్దు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ రాకకోసం ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని, రూట్‌ మ్యాప్‌ ప్రకటించిన తర్వాత ఇలాంటి నిర్ణయాలేంటని మండిపడ్డారు.

‘‘ భైంసా సున్నిత ప్రాంతం అంటున్నారు. ఇదేమైనా నిషేధిత ప్రాంతమా? అక్కడికి ఎందుకు వెళ్లకూడదు?’’ అని సంజయ్‌ ప్రశ్నించారు. ప్రస్తుతం తిరిగి కరీంనగర్‌కు వెళ్తున్నానని, సోమవారం మధ్యాహ్నం వరకు సమయం ఉందని, అప్పటిదాకా వేచి చూస్తానన్నారు. అంతకుముందు ప్రజా సంగ్రామ యాత్ర కోసం కరీంనగర్‌ నుంచి నిర్మల్‌ వెళ్తున్న బండి సంజయ్‌ను జగిత్యాల మండలంలోని తాటిపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు.  పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేసేందుకు యత్నించారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకున్న సంజయ్‌.. కార్యకర్తల వాహనంలో కోరుట్ల వైపు వెళ్లిపోయారు. ఈ క్రమంలో ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి ఇవ్వాలంటూ కార్యకర్తలు అందోళనకు దిగారు.

పాదయాత్ర చేస్తే భయమెందుకు: డీకే అరుణ

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టదలచిన ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవడం సీఎం పిరికి చర్యలకు నిదర్శనమని ఆ పార్టీ నాయకురాలు డీకే అరుణ ఆరోపించారు. రాష్ట్రంలో భాజపా బలపడటాన్ని ఓర్వలేక ఇలాంటి సిగ్గుమాలిన చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. బండి పాదయాత్ర చేస్తే భయమెందుకని ఆమె అన్నారు. తెరాస సర్కారు వైఫల్యాలన్నీ బయటపడతాయనే ఉద్దేశంతోనే పాదయాత్రను అడ్డుకుంటున్నారని ఆమె అన్నారు. ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్‌ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని