Andhra news: రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది: బండి శ్రీనివాస్‌

అవ్వాతాతలకు ఒకటో తేదీనే పింఛన్లు అందించే ప్రభుత్వం.. ఉద్యోగం చేసి రిటైరైన అవ్వాతాతలను మాత్రం పట్టించుకోవడం లేదని ఎపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస్‌ ఆరోపించారు.

Updated : 31 Jan 2023 19:10 IST

తాడేపల్లి: రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని ఎపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులు, పెన్షనర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం పక్షపాతం చూపిస్తోందని ఆక్షేపించారు. అవ్వాతాతలకు ఒకటో తేదీనే పింఛన్లు అందించే ప్రభుత్వం.. ఉద్యోగం చేసి రిటైరైన అవ్వాతాతలను మాత్రం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. తాడేపల్లిలో జరిగిన ఏపీఎస్‌ఆర్టీసీ ఎన్‌ఎంయూ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో పాల్గొన్న బండి శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, ఎన్‌ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు తీసుకునే పరిస్థితి పోయిందన్నారు. ఉద్యోగులను సంక్షోభంలోకి నెట్టి ప్రజలకు సంక్షేమాన్ని ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తే తొలుత సంతోషించామన్న బండి శ్రీనివాస్‌.. వారి సమస్యల పరిష్కరించకపోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు కష్టాలు పడుతున్నట్లు తెలిపారు.

విలీనం అనంతరం ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడినట్టయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు ఐదు డీఏలు ఇంకా రావాల్సి ఉందన్నారు. సంక్రాంతికి ఒక డీఏ ఇస్తామని సాక్షాత్తూ సీఎం చెప్పినా ఇప్పటి వరకు దిక్కు లేదన్నారు. ఏప్రిల్‌లో అన్ని డీఏలు ఇస్తామంటున్నా.. ఏ ఏప్రిల్‌కు ఇస్తారో తెలియడం లేదని వ్యంగ్యంగా అన్నారు. ‘నాన్నా పులి వచ్చింది’ అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తీరు ఉందన్న ఆయన.. సామ దాన భేద దండోపాయాలతో ఉద్యోగులు డిమాండ్లు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఇచ్చిన పీఆర్సీని చరిత్రలో ఇప్పటి వరకు చూడలేదని, పీఆర్సీ అమలుతో వేతనాలు, డీఏలు, హెచ్‌ఆర్‌ఏ పెరగకపోగా తగ్గాయన్నారు. పిల్ల పెళ్లి చేసినప్పుడు జీపీఎఫ్‌ కోసం దరఖాస్తు చేస్తే ఆ పిల్లకు పిల్లలు పుట్టి మనవరాలి బారసాలకు కూడా జీపీఎఫ్‌ రావడం లేదన్నారు. ఉద్యోగుల క్షోభ రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. సమాజంలో ఉద్యోగుల స్టేటస్‌ను రాష్ట్ర ప్రభుత్వం తగ్గిస్తోందని, ఈ నెలాఖరుకు ఏపీజేఏసీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి పోరాట కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి అన్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని