Bangaru Bonam: మేళతాళాల మధ్య బెజవాడ దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం

ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మకు తెలంగాణ నుంచి భక్తులు బంగారు బోనం సమర్పించారు. హైదరాబాద్‌లోని మహంకాళీ జాతర, ఉమ్మడి దేవాలయ

Published : 03 Jul 2022 16:36 IST

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు తెలంగాణ నుంచి భక్తులు బంగారు బోనం సమర్పించారు. హైదరాబాద్‌లోని మహంకాళీ జాతర, ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం తీసుకొచ్చారు. కమిటీ ఛైర్మన్ రాకేశ్‌ తివారీ, ఇతర కమిటీ సభ్యులు, తెలంగాణకు చెందిన కళాకారులు ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్నారు. జోగిని విశాక్రాంతి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు.

బ్రాహ్మణవీధిలోని అమ్మవారి జమ్మిదొడ్డి వద్ద బోనం సమర్పణకు ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో భ్రమరాంబ, స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ తదితరులు దుర్గమల్లేశ్వర స్వామి దేవస్థానం తరఫున ఊరేగింపునకు స్వాగతం పలికారు. గత 13 ఏళ్లుగా ప్రతి ఏటా ఆషాఢ మాసంలో తెలంగాణ నుంచి ఉమ్మడి దేవాలయాల కమిటీ దుర్గమ్మకు బంగారు బోనంతో పాటు సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి 1000 మంది కళాకారులు, ఆలయ కమిటీ ప్రతినిధులు గాజుల అంజయ్య ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. మేళతాళాల మధ్య బోనాన్ని ఎత్తుకున్న భక్తులు ఆనంద తాండవం చేశారు. ఊరేగింపులో భాగంగా కృష్ణానదిలో పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి బంగారు పాత్రలో బోనం, పట్టు వస్త్రాలు, వడి బియ్యం అందించారు. సకాలంలో వర్షాలు పడి, పాడి పంటలతో దేశం సమృద్ధిగా ఉండాలని, ఇరు రాష్ట్రాలు కలిసి మెలిసి ముందుకు సాగాలని భక్తులు ఆకాక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని