Ganesh Chaturthi: వినాయక చవితి వేడుకలపై బెంగళూరులో కఠిన ఆంక్షలు

కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో బెంగళూరు మహానగర పాలక సంస్థ వినాయక చవితి వేడుకలపై కఠిన ఆంక్షలు విధించింది. బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసే మండపాల్లో మూడు.......

Published : 07 Sep 2021 22:28 IST

బెంగళూరు: కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో బెంగళూరు మహానగర పాలక సంస్థ వినాయక చవితి వేడుకలపై కఠిన ఆంక్షలు విధించింది. బహిరంగప్రదేశాల్లో ఏర్పాటు చేసే మండపాల్లో మూడు రోజులు మాత్రమే ఈ వేడుకల నిర్వహణకు అనుమతిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజుల పాటు వినాయక చవితి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చినప్పటికీ బెంగళూరులో మాత్రం మూడు రోజులకే పరిమితం చేస్తూ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిపై బృహత్‌ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంసీ) ముఖ్య కమిషనర్‌ గౌరవ్‌ గుప్తా మాట్లాడుతూ.. ‘‘బెంగళూరు నగరంలో వినాయక చవితి వేడుకలను మూడు రోజులకు మించి అనుమతించం. విగ్రహాన్ని తీసుకొచ్చేటప్పుడు, నిమజ్జనం సమయంలో ఊరేగింపు నిర్వహించరాదు’’ అని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.

జిల్లా స్థాయి సీనియర్‌ ఉన్నతాధికారులు, బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ కమల్‌పంత్‌తో సమీక్ష సమావేశం అనంతరం  విలేకర్లతో మాట్లాడుతూ..  గతేడాది మాదిరిగానే ఈసారి కూడా నగరంలో వినాయక చవితి వేడుకలకు మూడు రోజుల పాటే అనుమతిస్తున్నట్టు చెప్పారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాలను నిషేధించినట్టు తెలిపారు. సంప్రదాయ వినాయక విగ్రహాలను (బయోడీగ్రేడబుల్‌ మెటీరియల్‌) ఇళ్లలోని బకెట్లలో లేదా తాము ఏర్పాటు చేసే మొబైల్‌ ట్యాంక్‌లలో నిమజ్జనం చేసుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన విగ్రహాలు గరిష్ఠంగా నాలుగు అడుగుల ఎత్తు ఉండాలని, వాటిని మొబైల్‌ ట్యాంక్‌లలోనే నిమజ్జనం చేయాలన్నారు. నగరంలో విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యేక ట్యాంక్‌లు ఏర్పాటు చేస్తున్నామని, సరస్సుల్లో నిమజ్జనం చేసేందుకు అనుమతించబోమని స్పష్టంచేశారు. ఒక వార్డుకు ఒక విగ్రహం మాత్రమే ఏర్పాటు చేయాలన్న ఆయన.. అందుకు బీబీఎంసీ, సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. నగరంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని