Telangana News: బీసీ కుల వృత్తుల కుటుంబాలకు రూ.లక్ష సాయం.. విధి విధానాలు ఖరారు

బీసీ కుల వృత్తుల వారికి కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందించే పథకానికి మంత్రి గంగుల కమలాకర్‌ నేతృత్వంలోని మంత్రి వర్గ ఉపసంఘం విధి విధానాలు ప్రకటించింది.

Updated : 06 Jun 2023 19:41 IST

హైదరాబాద్‌: రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా రాష్ట్రంలోని బీసీ కుల వృత్తుల వారికి కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందించాలని రాష్ట్ర మంత్రిమండలి ఇటీవల నిర్ణయించింది. రజక, నాయీ బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, శాలివాహన కుమ్మరి, మేదరి తదితర కులవృత్తుల వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి ప్రభుత్వపరంగా రూ. లక్ష సాయం అందించాలని నిర్ణయించింది.

 దీనికి ఇంకా ఏయే కులాలను పరిగణనలోకి తీసుకోవాలి.. సొమ్మును సాయంగా ఇవ్వాలా, రుణం రూపేణా సబ్సిడీగా ఇవ్వాలా అనే అంశాలపై విధివిధానాలను రూపొందించేందుకు మంత్రి గంగుల కమలాకర్‌ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. మంత్రులు తలసాని, శ్రీనివాస్‌గౌడ్‌, ప్రశాంత్‌రెడ్డి ఇందులో సభ్యులుగా ఉన్నారు.  మంత్రి వర్గ ఉప సంఘం తెలంగాణలోని బీసీ కులవృత్తులు, చేతివృత్తిదారులకు ఆర్థిక సాయానికి సంబంధించి విధివిధానాలను ఖరారు చేసింది. కుటుంబంలో ఒకరికి ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. గ్రామాల్లో రూ.1.50 లక్షలలోపు, పట్టణాల్లో రూ.2 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సున్న వారు మాత్రమే అర్హులు. దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ను మంత్రి గంగుల కమలాకర్‌ ఇవాళ  ప్రారంభించారు. ఆర్థిక సాయం కోసం https://tsobmmsbc.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫొటో, ఆధార్, కులధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మంచిర్యాల జిల్లాలో ఈనెల 9న ₹లక్ష ఆర్థిక సాయం పంపిణీని ప్రారంభించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని