పొట్ట వద్ద కొవ్వు తగ్గాలా..? ఇవి తినండి

పొట్టకూటి కోసమే కష్టపడుతుంటాం. కానీ, అదే పొట్టలో అతిగా ఆహారం వేశామో.. ఇక ఇబ్బందే. ఫాస్ట్‌ఫుడ్‌, చిరుతిండ్లు వంటివి ఏం తిన్నా అవి కొవ్వు రూపంలో ముందు పొట్ట చుట్టూ పేరుకుపోతాయి. కొవ్వును తగ్గించడం కోసం కొందరు వ్యాయామాలు చేస్తే.. మరికొందరు

Updated : 06 Sep 2020 16:15 IST

జానెడు పొట్ట కోసం అహర్నిశలూ శ్రమిస్తాం. కానీ, అదే పొట్టలో అతిగా ఆహారం వేశామో.. ఇక ఇబ్బందే. ఫాస్ట్‌ఫుడ్‌, చిరుతిళ్లు వంటివి ఏం తిన్నా అవి కొవ్వు రూపంలో పొట్ట చుట్టూ పేరుకుపోతాయి. కొవ్వును తగ్గించడం కోసం కొందరు వ్యాయామాలు చేస్తే.. మరికొందరు తినడం మానేస్తున్నారు. కొవ్వు కరిగించుకోవడానికి తినడం మానేయడం పరిష్కారం కాదు.. కొన్ని ఆహార పదార్థాలు తినడం అలవాటు చేసుకుంటే కొవ్వు కరిగి సన్నబడతారని నిపుణులు చెబుతున్నారు. ఆ ఆహార పదార్థాలేంటో తెలుసుకొని మీరూ పాటించేయండి.

మిరపకాయలు: రోజు తినే ఆహారంలో కాస్త మిరపకాయల కారం ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఇందులోని కాప్సీయసిన్‌ జీవక్రియను పెంచడంతోపాటు పొట్ట వద్ద ఉండే కొవ్వును కరిగించేస్తుంది. అలాగే జీర్ణసమస్యలను నయం చేస్తుంది.

సాల్మన్‌ చేప: ఈ చేపల్లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. ఇవి కొవ్వు పదార్థాలను కరిగించే ఎడిపొగెక్టిన్‌ అనే హార్మోన్‌ పనితీరును పెంచుతాయి. తద్వారా అనసవరమైన కొవ్వు కరిగిపోతుంది. కాబట్టి అప్పుడప్పుడు సాల్మన్‌ చేపలను తింటూ ఉండండి.

గుడ్డు: గుడ్డులో అనేక పోషకాలు ఉన్నాయని అందరికి తెలుసు. అయితే చాలా మంది పచ్చసోనను తినకుండా వదిలేస్తుంటారు. పచ్చసోనలో ఉండే కొలిన్‌ అనే పోషకం కొవ్వును కరిగించడానికి దోహదపడుతుందట. ఈ సారి నుంచి పచ్చసోనను తినడం అలవాటు చేసుకోండి.

అవకాడో: ఈ పండ్లలో మనిషికి అవసరమయ్యే కొవ్వు మాత్రమే ఉంటుంది. ఈ పండ్లను భోజనంతోపాటు తీసుకుంటే కడుపు నిండటంతోపాటు అనవసర కొవ్వులు పేరుకుపోకుండా నిలువరిస్తుంది. ఓ సర్వే ప్రకారం ఒక అవకాడో పండు తిన్నవాళ్లు మళ్లీ ఇతర ఆహార పదార్థాలు తినడానికి ఇష్టపడరట. 

దాల్చిన చెక్క: మీరు తీసుకునే ఆహారంలో దాల్చిన చెక్క ఉండేలా చేసుకోండి. ఇందులోని సిన్నమాల్డిహైడ్ మనిషిని సన్నబడేలా చేస్తుందట. ఇది ఇన్సులిన్‌ స్రవాలను నియంత్రిస్తుందట. తద్వారా చక్కెర కొవ్వుగా మారి శరీరంలో పేరుకుపోకుండా నిలువరిస్తుందన్నమాట. 

అరటిపండ్లు: నిత్యం లభించే అరటి పండ్లు మన పొట్ట సమస్యలను తగ్గిస్తుందట. ప్రతి రోజు భోజనానికి ముందు ఒక్క అరటిపండు చొప్పున రెండుసార్లు తింటే.. రెండునెలల్లో 50శాతం పొట్ట తగ్గిపోతుందని ఓ సర్వేలో తేలిందట.

చిలగడదుంపలు: వీటిలో ఉండే కెరొటెనాయిడ్స్‌ యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తూ రక్తంలో చక్కెర స్థాయిని, ఇన్సులిన్‌ను నియంత్రిస్తాయి. తద్వారా తిన్న పదార్థాలు కొవ్వుగా మారకుండా చేస్తాయి. బ్లూ బెర్రీస్‌ కూడా యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తూ కొవ్వు ఏర్పడకుండా అడ్డుకుంటాయి.

గ్రీక్‌ యొగర్ట్‌: అన్ని యొగర్ట్‌లు ఒకేలా ఉండవు. మార్కెట్లో ప్రత్యేకంగా లభించే గ్రీక్‌ యొగర్ట్‌ను తినడం అలవాటు చేసుకోండి. అందులో ఉండే ఫెనిలలానైన్‌ అనే ఆమైనో యాసిడ్‌ ఆకలిని ప్రేరేపించే హార్మోన్లను నిలువరిస్తుంది. దీని వల్ల త్వరగా ఆకలి అనిపించదు. ఇది మనిషి బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని