solar power: సోలార్‌ విద్యుత్‌తో రైతులకు ప్రయోజనాలు!  

ఇటీవల ప్రధానమంత్రి మాట్లాడుతూ రైతులు తమ పొలాల్లో సౌరవిద్యుత్‌ శక్తికి అనుమతిస్తే స్థిరంగా ఆదాయం పొందవచ్చని తెలిపారు. పునరుత్పాధక ఇంధనాల స్థాపిత సామర్థ్యంలో మన దేశం తొలి అయిదు స్థానాల్లో నిలిచిన దేశాల్లో ఒకటని ఆయన గతంలో వెల్లడించారు

Published : 30 Jul 2021 23:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల ప్రధానమంత్రి మాట్లాడుతూ రైతులు తమ పొలాల్లో సౌరవిద్యుత్‌ శక్తికి అనుమతిస్తే స్థిరంగా ఆదాయం పొందవచ్చని తెలిపారు. పునరుత్పాదక ఇంధనాల స్థాపిత సామర్థ్యంలో మన దేశం తొలి అయిదు స్థానాల్లో నిలిచిన దేశాల్లో ఒకటని ఆయన గతంలో వెల్లడించారు. సౌర విద్యుత్‌ అవసరం, ఆ రంగంలో రైతులకు ప్రభుత్వం అందించే సాయం, దానివల్ల ఉపయోగాల గురించి తెలుసుకుందాం.

సౌర విద్యుత్‌ భవిష్యత్తు?

గత పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా సోలార్‌ ఫలకాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. కాలుష్యం వల్ల భూతాపం పెరుగుతుండటంతో అన్ని దేశాలు పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించాలని కంకణం కట్టుకున్నాయి. దానికి తగ్గట్టు అనేక రాయితీలు ప్రకటిస్తున్నాయి. సోలార్‌ విద్యుత్‌ ఉత్పాదనకు సంబంధించి ఖర్చు తగ్గిస్తూ, ఎక్కువ సామర్థ్యంతో పనిచేసేందుకు అవసరమైన ఉపకరణాల తయారీపై విరివిగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇందులో సాంకేతికత చాలా వేగంగా వృద్ధి చెందుతోంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న ఇంధన వనరులకు సమీప భవిష్యత్తులో సౌరవిద్యుత్‌ ఓ సవాల్‌ విసరబోతోంది.

వ్యవసాయంలో స్వయం సమృద్ధికి మార్గం!

భారతదేశంలో దాదాపు 60 శాతం మంది వ్యవసాయం మీదే ఆధారపడి బతుకుతున్నారు.  దేశ జీడీపీకి 18 శాతం ఈ రంగం నుంచే వస్తోంది. కానీ రైతులు ఎక్కువగా గ్రిడ్‌కు అనుసంధానమైన విద్యుత్‌ పంపుసెట్లపై ఆధారపడి ఉన్నారు. దేశంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో 20 శాతం వ్యవసాయానికి ఖర్చవుతుంది. ఈ రంగానికి తగినంత విద్యుత్‌ సరఫరా చేయడం కొన్ని రాష్ట్రాల్లో కష్టమవుతోంది. రైతులకు 24 గంటలూ విద్యుత్‌ అనేది ఇంకా చాలా రాష్ట్రాల్లో కలగానే మిగిలింది. మనదేశంలో వ్యవసాయం చాలావరకు రుతుపవనాల మీద ఆధారపడి నాలుగైదు నెలలే ఉండటం వల్ల మిగతా ఏడెనిమిది నెలలు భూమి ఖాళీగా ఉంటుంది.  కానీ, మొదటిసారి దేశంలో రైతులు  తమ రంగానికి కావాల్సిన విద్యుత్‌పై కూడా నియంత్రణ సాధించబోతున్నారు. ప్రధాన మంత్రి కిసాన్‌ ఉర్జా సురక్ష ఏవమ్‌ ఉత్తాన్‌ మహాభియాన్‌(పీఎంకెయుఎస్‌యుఎమ్‌) కింద రైతులు తమ పొలాల్లో సౌర శక్తితోనే విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చు. దీనికింద 2022 నాటికి 30 గిగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయాలనేది ప్రభుత్వం లక్ష్యం. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన అభివృద్ధి లక్ష్యానికి అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తిని రెండు రెట్లు చేసేందుకు, 2030 నాటికి రైతులకు చాలినంత కూలీ లభించాలంటే సౌర విద్యుత్‌ను ప్రోత్సహించాలి. గ్రిడ్‌తో అనుసంధానం లేకుండా ఉండే, సౌరశక్తితో నడిచే 20 లక్షల పంపుసెట్లను 2022 నాటికి ఏర్పాటు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం!

మనదేశంలో వ్యవసాయానికి ఎక్కువగా రాత్రిపూటే విద్యుత్‌ లభిస్తుంది. పగలు ఫ్యాక్టరీలు నడుస్తుంటాయి. కానీ 2030నాటికి 30 గిగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తితో వ్యవసాయానికి పగటిపూట విద్యుత్‌ను అందివ్వాలనే లక్ష్యం కూడా ఉంది. బిందు సేద్యం, తుంపర సేద్యాన్ని సౌర విద్యుత్‌ పంపుసెట్లతో అనుసంధానం చేసుకోవడం వల్ల రైతులు ఎక్కువ దిగుబడులు పొందవచ్చు. ఖర్చు తగ్గించుకోవచ్చు.  డీజిల్‌తో నడిచే పంపుసెట్లను తగ్గించేందుకు, సౌర విద్యుత్‌ పంపుసెట్‌ను ఏర్పాటు చేసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆర్థిక సాయం అందుతోంది.  దీనికి కేంద్ర ప్రభుత్వం 30 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం నిధులు అందిస్తాయి. 30 శాతం బ్యాంకుల నుంచి అందుతుంది. రైతులు 10 శాతం మేర  పెట్టుబడి పెట్టాలి.  అందువల్ల రైతులకు సోలార్‌ సబ్‌మెర్సిబుల్‌ పంపుసెట్లకు  90 శాతం సబ్సిడీ లభిస్తుంది. వీటికి ఏమాత్రం వేరే విద్యుత్‌ సరఫరాతో అవసరం ఉండదు. 1 హెచ్‌పీ పంపుసెట్‌కు రూ. 84 వేలు, 5 హెచ్‌పీ సోలార్‌ పంపుసెట్‌కు రూ.2.9 లక్షలు, 10 హెచ్‌పీ పంపుసెట్‌కు రూ.5.8 లక్షలు ఖర్చవుతుంది. కానీ మొత్తం ఖర్చులో 10 శాతం మాత్రమే రైతు పెట్టుకోవాలి. ఒకసారి ఏర్పాటు చేశాక మళ్లీ  ఇతర ఖర్చులంటూ ఏమీ ఉండవు. ఎలాంటి ఇంధనం, కందెనలు అవసరం లేదు. మోటార్లు కాలడం, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం, తక్కువ వోల్టేజీ, సింగిల్‌ ఫేజ్‌ లాంటి సమస్యలు ఉండవు. విద్యుత్‌ లైన్లు, స్తంభాలు లేని పొలాలకు సోలార్‌ పంపుసెట్లే మార్గం. ఒకసారి పెట్టుబడి పెడితే 25-30 ఏళ్ల వరకు తిరుగులేదు.

సౌర విద్యుత్‌ వల్ల లాభాలు

కనీసం ఒక మెగావాట్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తే 200 ఇళ్లకు కరెంట్‌ సప్లయ్‌ చేయవచ్చు. ఒకసారి సౌర విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్‌ను స్థాపిస్తే భూ యజమానులకు 25 ఏళ్లపాటు ఆదాయాన్ని అందిస్తుంది. వ్యవసాయానికి పనికిరాని బీడు భూముల్లో రైతులు సౌర విద్యుత్‌ స్థాపనకు అనుమతిస్తే స్థిరమైన ఆదాయం పొందవచ్చు.  సోలార్‌ ప్యానెళ్లను సారవంతమైన భూముల్లోనూ ఏర్పాటు చేసుకోవచ్చు. కాకపోతే భూమి మీద ఐదు అడుగుల ఎత్తులో వాటిని బిగించాలి. అప్పుడు ఆ భూముల్లో పంటలూ పండించుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని