Viral Video: నూటికో కోటికో ఒక్కరు.. అది మీరే మీరే మా టీచర్‌..

మనం జీవితంలో ఎంత ఉన్నతస్థాయికి ఎదిగిన మనకు విద్యబుద్ధులు నేర్పిన గురువులను మాత్రం ఎప్పటికీ మార్చిపోం. ముఖ్యంగా పాఠశాల విద్యనభ్యసించే సమయంలో ఉపాధ్యాయులతో విద్యార్థులకు మంచి అనుబంధం ఉంటుంది.

Published : 21 Feb 2022 01:27 IST

ఇంటర్నెట్ డెస్క్: మనం జీవితంలో ఎంత ఉన్నతస్థాయికి ఎదిగినా మనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను మాత్రం ఎప్పటికీ మార్చిపోం. ముఖ్యంగా పాఠశాల విద్యనభ్యసించే సమయంలో ఉపాధ్యాయులతో విద్యార్థులకు మంచి అనుబంధం ఉంటుంది. కొంత మంది ఉపాధ్యాయులు విద్యార్థులను తమ సొంత పిల్లల మాదిరిగా చూసుకుంటారు. అయితే, ప్రభుత్వ ఉద్యోగాల్లో బదిలీలు, పదోన్నతులు సాధారణం. ఎంత మంచి ఉపాధ్యాయుడికైనా కొన్ని సంవత్సరాల తర్వాత వేరే పాఠశాలకు వెళ్లక తప్పదు. ఇన్నేళ్లపాటు చదువు చెప్పిన గురువు ఉన్నట్టుండి పాఠశాల నుంచి వెళ్లిపోతుంటే విద్యార్థులు భావోద్వేగానికి గురవుతారు.  కొంతమంది కంటతడి పెట్టుకుంటారు. ఇన్ని రోజులు తమకు పాఠాలు బోధించిన ఉపాధ్యాయుడికి జీవితంలో గుర్తుండిపోయేలా వీడ్కోలు పలుకుతారు. ఇలాంటి సంఘటనే కోల్‌కతాలో చోటుచేసుకుంది. విద్యార్థులు ఇచ్చిన సర్‌ప్రైజ్‌కు బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయురాలు కంటతడి పెట్టింది.   

వివరాల్లోకి వెళితే.. పశ్చిమబెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలోని కటియాహత్‌ బీకేఏపీ బాలికల ఉన్నత పాఠశాలలో సంపా అనే ఉపాధ్యాయురాలు పనిచేస్తున్నారు. ఆమె ఇటీవల వేరే పాఠశాలకు బదిలీ అయ్యారు. ఇన్నాళ్ల తమకు పాఠాలు బోధించిన ఉపాధ్యాయురాలు వేరే పాఠశాలకు బదిలీ కావడంతో విద్యార్థినులు భావోద్వేగపూరితంగా వీడ్కోలు పలికారు. టీచర్‌ పాఠశాలను వీడుతున్న సమయంలో ఆమెకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఇద్దరు విద్యార్థినులు ఉపాధ్యాయురాలికి కళ్లకు గంతలు కట్టి పాఠశాల మైదానంలోకి తీసుకొచ్చారు.  తర్వాత ఆమెను కళ్లు తెరవమని కోరారు. వెంటనే కొంతమంది విద్యార్థినులు గులాబీ పువ్వులు చేతిలో పట్టుకుని మోకాళ్లపై కూర్చొని ‘మేము నీలో దేవుడిని చూస్తున్నాం’ అనే హిందీ పాటను పాడి భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. విద్యార్థినులు చూపుతున్న ప్రేమ, ఆప్యాయతలను చూసి ఎమోషనల్‌ అయ్యారు. వెంటనే వారిని దగ్గరకు తీసుకుని కంటతడి పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియోలో వైరల్‌గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు.. ‘ఇలాంటి టీచర్​ దొరికినందుకు నిజంగా మీరు అదృష్టవంతులు’, ‘నిజంగా.. మా పాఠశాల రోజులు​​ గుర్తుకు వచ్చాయి’, ‘ఇంతటి ప్రేమను చూపించే విద్యార్థులు దొరకడం కూడా చాలా అరుదు’, ‘వీడియో చూస్తుంటే కళ్లలో నీళ్లు  ఆగడం లేదు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని