Viral News: ‘అమ్మకానికి కిడ్నీ’ అంటూ పోస్టర్‌.. ఇది కదా అసలు ట్విస్ట్‌!

బెంగళూరులో అద్దె ఇంటిని వెతికేందుకు ఓ వ్యక్తి స్థానికంగా అతికించిన ఓ పోస్టర్‌ వైరల్‌గా మారింది. కారణం.. అందులో అద్దె డిపాజిట్‌ చెల్లించేందుకు కిడ్నీ విక్రయానికి ఉందని పొందుపరచడమే!

Published : 01 Mar 2023 01:45 IST

బెంగళూరు: మహా నగరాల్లో సరైన ఇల్లు అద్దె(Rent House)కు దొరకడం చాలా కష్టం. ఒకవేళ లభించినా.. దాని నెలవారీ కిరాయి, సెక్యూరిటీ డిపాజిట్‌(Security Deposit)ల వివరాలు ఆరా తీస్తే కళ్లు తిరగాల్సిందే..! ఇలాంటి పరిస్థితుల్లో కర్ణాటక రాజధాని బెంగళూరు(Bengaluru)లో అద్దె ఇంటి అన్వేషణకు విచిత్ర మార్గాన్ని ఎంచుకున్నాడో వ్యక్తి. అద్దె ఇంటి సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లింపు కోసం ఏకంగా తన కిడ్నీ అమ్మకానికి ఉందంటూ(Kidney For Sale) స్థానికంగా ఓ పోస్టర్‌ అతికించాడు. ఇదికాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

‘ఎడమ కిడ్నీ విక్రయానికి ఉంది. ఇంటి యజమానులు అడుగుతున్న సెక్యూరిటీ డిపాజిట్‌ కోసం పెద్దఎత్తున డబ్బు అవసరం. అందుకే ఈ ప్రయత్నం’ అని ఆ పోస్టర్‌లో పెద్ద అక్షరాల్లో కనిపిస్తోంది. అయితే, ఇది చదివి ఆశ్చర్యపోయే వారు.. ఇంకాస్త కిందకు వెళ్లి చూస్తే అసలు విషయం తెలుస్తుంది. ‘కిడ్నీ విక్రయం సరదాకే అంటున్నా. కానీ, నాకు ఇందిరానగర్‌లో ఓ ఇల్లు అవసరం’ అని చిన్న అక్షరాల్లో రాసి ఉంది. తనకు సంబంధించిన వివరాల కోసం స్కాన్‌ చేయాలంటూ ఓ క్యూఆర్‌ కోడ్‌నూ పోస్టర్‌పై ముద్రించడం గమనార్హం.

సామాజిక మాధ్యమాల్లో ఈ పోస్ట్‌ కాస్త.. మహా నగరాల్లో పెరిగిపోతున్న ఇంటి అద్దెలపై చర్చకు దారితీసింది. మెట్రో సిటీల్లో ఈ అద్దె కష్టాలు వాస్తవమేనంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. అందరూ ఓకే ప్రాంతంలో ఇల్లు కోరుకుంటుండటంతో సమస్య తలెత్తుతోందంటూ ఓ నెటిజన్‌ స్పందించాడు. ఎవరో ఐఫోన్‌ కొనేందుకు యత్నిస్తున్నారంటూ ఒకరు సరదాగా వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని