Bengaluru: బెంగళూరుకు గులాబీ శోభ.. నగరంలో కొత్త అందాల ఫొటోలు చూశారా?

బెంగళూరు నగర రహదారులు సరికొత్త ప్రకృతి అందాలతో గులాబీమయంగా మారాయి. ప్రతి ఏటా మార్చి లేదా ఏప్రిల్‌ నెలలో వికసించే పింక్‌ ట్రంపెట్స్‌ పూలు, ఈసారి కాస్త ముందుగానే వికసించడంతో రోడ్లు గులాబీ తోటలను తలపిస్తున్నాయి.

Published : 31 Jan 2023 01:19 IST

బెంగళూరు: భారత ఐటీ రాజధాని అనగానే ముందుగా గుర్తొచ్చేది బెంగళూరు నగరమే. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే ఇక్కడి వాతావరణం కాస్త చల్లగా ఉంటుంది. నగరంలోని లాల్‌బాగ్‌ గార్డెన్స్‌ ప్రత్యేక పర్యాటక ఆకర్షణ. ఏటా ఇక్కడ జరిగే ఫ్లవర్‌ ఫెస్టివల్‌కు భారీ సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. ప్రస్తుతం బెంగళూరులో మరో ప్రకృతి శోభ గత కొన్ని రోజులుగా నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అవే పింక్‌ ట్రంపెట్స్‌ పూలు. బెంగళూరు సెంట్రల్‌, బసవగుండి, రింగ్‌ రోడ్‌, ఇందిర నగర్‌, మల్లేశ్వరం, చామరాజ్‌పేట, సంజయ్‌ నగర్‌ వంటి ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా ఈ పూల చెట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ పూలు వికసిస్తుండటంతో ఆ దారిలో వెళ్లే ప్రయాణికులు గులాబీ తోటలోంచి ప్రయాణిస్తున్న అనుభూతిని పొందుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. 

ఈ ఫొటోలను కర్ణాటక పర్యాటక శాఖ ఇటీవల తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ‘‘బెంగళూరులో పింక్‌ ట్రంపెట్స్‌గా పిలిచే పూలు వికసించడం ప్రారంభించాయి. దీంతో బెంగళూరులోని కొన్ని దారులు గులాబీ రంగులోకి మారాయి’’ అని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. సాధారణంగా ఏటా ఇవి మార్చి లేదా ఏప్రిల్‌ నెలలో వికసిస్తాయి. కానీ, ఈసారి కాస్త ముందుగానే నగరానికి గులాబీ శోభను తెచ్చాయని ఓ నెటిజన్‌ ట్వీట్ చేశారు. ఈ ప్రకృతి అందాలను మనం జాగ్రత్తగా కాపాడితే, మన తర్వాతి తరాలకు కూడా ఈ ప్రకృతి రమణీయతను అందించవచ్చని మరో నెటిజన్‌ కామెంట్ చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని