Health tips: ఆరు రుచులతో ఆరోగ్యం.. ఈ విశేషాలు మీకు తెలుసా?

మన శరీరం యంత్రం లాంటిది. ఇది నిరంతరం పని చేయాలంటే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు ఆహారం రూపంలో అందించాలి.  వీటితో పాటు షడ్రుచులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతి రోజు ఆహారంలో ఆరు రుచులు ఉండేలా చేసుకుంటే చాలా మంచిదని ఆయుర్వేదం చెబుతోంది.

Published : 18 Aug 2022 02:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మన శరీరం యంత్రం లాంటిది. ఇది నిరంతరం పని చేయాలంటే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు ఆహారం రూపంలో అందించాలి.  వీటితో పాటు షడ్రుచులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజూ ఆహారంలో ఆరు రుచులు ఉండేలా చేసుకుంటే చాలా మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. ఆ రుచులు అందించే ఆరోగ్యం ఎంతో విలువైనది. అపురూపమైన ఆ ప్రయోజనాల గురించి ఆయుర్వేద ఫిజిషియన్‌ డాక్టర్‌ గాయత్రిదేవి వివరించారు. 

మధుర రసం

ప్రకృతి ప్రసాదంగా లభించే తీపి పదార్థాలు తింటే ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. చెరకు, బెల్లం, బియ్యం, పప్పులు, దుంప కూరలు లాంటి తీయటి రుచులను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి తీసుకోవడంతో మనసుకు సంతృప్తికరంగా ఉంటుంది. పిల్లల ఎదుగుదలకు ఎంతో సహకరిస్తుంది. ప్రతి కణం ఆరోగ్యంగా పెరుగుతుంది. వాత, పిత్త దోషం నివారిస్తుంది. 

పులుపు

ఇది మన ఆరోగ్యానికి ఎంతో అవసరం. కానీ, మధుర రసం అంత తీసుకోవద్దు. ఆకలి, జీర్ణం పెంచుతుంది. మలబద్దకం లేకుండా చేస్తుంది. డీ హైడ్రేషన్‌ రాకుండా నివారిస్తుంది. మూత్రం సాఫీగా వెళ్లడానికి దోహదపడుతుంది. 

ఉప్పు

లవణం ఎంతో కీలకం. ఆకలి, జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తుంది. కడుపులో గ్యాస్‌ రాకుండా చేస్తుంది. ఉప్పును అతిగా తీసుకుంటే చర్మంపై ముడతలు పడతాయి. వెంట్రుకలు తెల్లగా అవుతాయి. జుట్టు రాలిపోతుంది. కిడ్నీలు దెబ్బతింటాయి. 

కారం

జీవ క్రియలు బాగా పని చేయడానికి ఉపయోగపడుతుంది. బరువు ఎక్కువగా ఉంటే తగ్గించుకోవడానికి వీలవుతుంది. బరువు పెరగకుండా చూస్తుంది. రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది. గుండె రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడకుండా ఉంటుంది. 

చేదు

అతిగా విరేచనాలయినా, రక్తం కారిపోతున్నా అరికడుతుంది. చెమట అధికంగా పట్టకుండా చూస్తుంది. రక్తశుద్ధి చేస్తుంది. రక్తంలో మలినాలను తొలగిస్తుంది. 

వగరు

చాలా తక్కువగా తీసుకోవాలి. విరేచనాలు కాకుండా చూస్తుంది. రక్తం పలచపడకుండా అడ్డుకుంటుంది. మహిళలకు నెలసరిలో అధిక రక్తస్రావం కాకుండా చేస్తుంది. విటమిన్‌ సి అందిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని