ఏపీ@2020: జ్ఞాపకాలు..పీడకలలు!

ఏడాదికో కొత్త సంవత్సరం వస్తుంది.. పాత సంవత్సరాన్ని వెనక్కి నెడుతుంది. కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టాక పాత రోజుల్లోకి ఒకసారి తొంగి చూస్తే కొన్ని మెరుపులు,

Updated : 31 Dec 2020 15:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఏడాదికో కొత్త సంవత్సరం వస్తుంది.. పాత సంవత్సరాన్ని వెనక్కి నెడుతుంది. కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టాక పాత రోజుల్లోకి ఒకసారి తొంగి చూస్తే కొన్ని మెరుపులు, మరకలు, తీపి గుర్తులు, చేదు గుళికలు ఉంటాయి. కరోనా నామ సంవత్సరంగా మిగిలిన 2020 ఏడాదిలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయి. అందులో మరచిపోలేని పీడకలలేంటి? గుర్తుంచుకో దగిన జ్ఞాపకాలేంటి? పాలనా పరంగా, రాజకీయ పరంగా చరిత్రలో చెప్పుకోదగిన సందర్భాలేంటి? కొంగొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగెడుతున్న వేళ గడిచిన ఏడాదిని ఓసారి తిరిగి చూద్దాం. 

కరోనా@2020

2020.. ఈ సంవత్సరం గురించి తలచుకుంటే ముందుగా చెప్పుకోవాల్సింది కరోనా వైరస్‌ గురించే. కంటికి కనిపించని శత్రువులా ప్రపంచమంతటినీ అల్లాడించిన కొవిడ్‌.. రాష్ట్రాన్ని ఓ చుట్టు చుట్టేసింది. మార్చి 11వ తేదీన రాష్ట్రంలో తొలి పాజిటివ్‌ కేసు వెలుగు చూడగా.. ఏప్రిల్‌ 3న తొలి మరణం నమోదైంది. మొదట్లో రోజుకు పది కేసులుగా నమోదు కాగా.. అవి కాస్తా పది వేల కేసులు దాటేసి ప్రజలను భయపెట్టింది. ముఖ్యంగా కర్నూలు, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాలపై అధిక ప్రభావం చూపింది. ఓ దశలో దేశంలోని టాప్‌ 30 కరోనా ప్రభావిత జిల్లాల్లో ఏపీ నుంచే 12 జిల్లాలు ఉండటం ఆందోళన కలిగించింది. కరోనా వైరస్‌ ఏపీలో కొత్త రికార్డు సృష్టిస్తే ప్రభుత్వం కూడా రికార్డు స్థాయిలో పరీక్షలు చేయించింది. కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రంలో ఏడు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 


స్థానికంపై సమరం..

కరోనా తర్వాత రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారిన అంశం ఏదైనా ఉందంటే అది స్థానిక సంస్థల ఎన్నికలే. ఎన్నికల మొదట్లో పార్టీల మధ్య యుద్ధం నడిస్తే.. ప్రక్రియ వాయిదాతో ఎస్‌ఈసీ-ప్రభుత్వానికి మధ్య సమరం మొదలైంది. నామినేషన్ల పర్వంలో బలవంతపు ఏకగ్రీవాలు, మాచర్ల, తిరుపతి, పుంగనూరులో హింసాత్మక ఘటనలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకొని వైకాపా ఏకంగా 2,129 ఎంపీటీసీలు, 125 జడ్పీటీసీలను ఏకగ్రీవం చేసుకుందని విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ఈలోగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడంతో ఎన్నికల ప్రక్రియను ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ వాయిదా వేశారు. దీంతో కంగుతిన్న వైకాపా ప్రభుత్వం.. నిమ్మగడ్డ పదవీకాలాన్ని కుదిస్తూ ఆర్డినెన్స్‌ జారీ చేయడంతో పాటు ఆ స్థానంలో మద్రాస్‌ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ కనగరాజును కూర్చోబెట్టింది. లాక్‌డౌన్‌ వేళ జస్టిస్‌ కనగరాజును చెన్నై నుంచి రప్పించి ప్రమాణ స్వీకారం చేయించడం పెద్ద దుమారమే రేపింది. ఆ తర్వాత నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ న్యాయపోరాటానికి దిగడం, కనగరాజు నియామకాన్ని హైకోర్టు కొట్టేయడం, నిమ్మగడ్డను ఎస్‌ఈసీగా హైకోర్టు పునరుద్ధరించడం ఓ కేస్‌ స్టడీగా మిగిలిపోయింది. ఇంత జరిగినా 2020ఏడాదంతా స్థానిక సంస్థల ఎన్నికలకు నోచుకోలేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పోలింగ్‌కు నిమ్మగడ్డ సిద్ధం అంటున్నా.. కరోనా సాకుతో ప్రభుత్వం కుదరదంటోంది. 


కదలని రాజధాని..

2020 సంవత్సరంలో రాష్ట్రంలో ఉత్కంఠ రేపిన మరో అంశం రాజధాని వికేంద్రీకరణ. మూడు రాజధానుల అమలుకు ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించిందో.. అంగుళం కూడా కదలడానికి వీల్లేదంటూ అమరావతి రైతులు అంత మొండిగా ఉద్యమించారు. ఈ క్రమంలో ఏడాది మైలురాయిని దాటారు. ప్రభుత్వం తన పంతం నెగ్గించుకునేందుకు చివరకు శాసనమండలి రద్దుకూ వెనుకాడలేదు. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను సంఖ్యా బలంతో అసెంబ్లీలో ప్రభుత్వం ఆమోదించుకున్నా మండలిలో తిరస్కరణ ఎదురైంది. బిల్లులను మండలి ఛైర్మన్‌ సెలెక్ట్‌ కమిటీకి పంపారు. ఈ పరిణామాలపై ఆగ్రహించిన వైకాపా సర్కార్‌ శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానించి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ప్రస్తుతం బంతి కేంద్రం కోర్టులో ఉంది. రాజధాని వికేంద్రీకరణ కూడా కోర్టుల పరిధిలోకే వెళ్లింది. ఉద్యమమే ఊపిరిగా ముందుకెళ్తు్న్న అమరావతి రైతులు.. న్యాయపోరాటంలోనూ రాటుదేలారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా పదుల సంఖ్యలో పిటిషన్లు వేసి న్యాయం కోసం పోరాడుతున్నారు.


 దాడుల దుమారం..

రాష్ట్రంలో ఆలయాలపై మునుపెన్నడూ జరగనన్ని దాడులు జరగడం రాజకీయ కాకరేపింది. అంతర్వేదిలో రథం దగ్ధం ఘటన హిందూ సమాజంలో మంట పుట్టించింది. అదేవిధంగా లాక్‌డౌన్‌ కాలంలో దుర్గగుడి రథానికి ఉండే వెండి సింహాల మాయం కావడం కూడా భక్తుల్లో అసంతృప్తిని పెంచింది. నిత్య కల్యాణం, పచ్చతోరణంలా భక్త కోటితో కిటకిటలాడే తిరుమల గిరుల్లో కరోనా ప్రభావంతో కొన్ని నెలలు నిశ్శబ్దం ఆవహించింది. లాక్‌డౌన్‌లో భాగంగా 80 రోజులు సుదీర్ఘంగా ఆలయాన్ని మూసి ఉంచడం చరిత్రలోనే తొలిసారి. పదిరోజుల పాటు శ్రీవారి వైకుంఠ దర్శనం కల్పించడం కూడా చరిత్రలో తొలిసారి కావడం విశేషం. అదేవిధంగా 12 సంవత్సరాలకోసారి వచ్చే తుంగభద్ర పుష్కరాలు కరోనా ప్రభావంతో ఈ ఏడాది సాదాసీదాగా జరిగాయి. 


రాజకీయాంధ్ర..

ఈ ఏడాది ఏపీలో రాజకీయ పరంగా చూస్తే రెండున్నరేళ్ల తర్వాత మంత్రి వర్గంలో మార్పులు చేస్తానన్న సీఎం జగన్‌.. ముందే మార్పులు చేయాల్సి వచ్చింది. మొదట్నుంచి జట్టులో ఉన్న పిల్లి సుభాష్‌ చంద్రబోష్‌, మోపిదేవి వెంకటరమణలను రాజ్యసభకు పంపి వారి స్థానంలో.. వేణుగోపాల కృష్ణ, సీదిరి అప్పలరాజును తీసుకున్నారు. గవర్నర్‌ కోటాలో జకియా ఖానం, పండుల రవీంద్ర బాబును మండలికి పంపారు. ఇక తెలుగుదేశం కూడా సంస్థాగత మార్పులకు ముందడుగు వేసింది. జిల్లా కమిటీల స్థానంలో పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా ఇన్‌ఛార్జిలను నియమించింది. రాష్ట్ర తెదేపా అధ్యక్ష బాధ్యతలను మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకి అప్పగించారు. 2024లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామంటూ భాజపా, జనసేన చేతులు కలిపిందీ ఈ ఏడాదిలోనే. 


ప్రకృతి విపత్తులు, విశాఖ ఎల్జీ పాలిమర్స్‌, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధి, ఎస్పీ బాలు మృతి ఇలా చెప్పుకుంటే పోతే ఈ ఏడాది రాష్ట్రంలో ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నాయి.  మరింత సమాచారం ఈ కింది వీడియోలో... 

ఇవీ చదవండి..
తెలంగాణలో నేరాలు..ఘోరాలు@ 2020

గుడ్‌బై 2020.. పార్టీకి వేళాయరా..!
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని