Bhatti Vikaramarka: డ్రగ్స్‌ వినియోగం.. విష ప్రయోగం లాంటిది: డిప్యూటీ సీఎం భట్టి

రాష్ట్రంలో డ్రగ్స్‌ నిర్మూలనకు తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

Updated : 25 Jun 2024 14:12 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో డ్రగ్స్‌ నిర్మూలనకు తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ విషయంపై ఏ స్థాయిలో అయినా నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్డులో జలవిహార్‌ వద్ద డ్రగ్స్‌ నిర్మూలన ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. 

‘‘డ్రగ్స్‌ వినియోగం విష ప్రయోగం లాంటిది.. ఇది అత్యంత ప్రమాదకరం. కుటుంబ వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తుంది. డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న సంఘ విద్రోహశక్తుల చేతిలో యువత జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయి. తెలిసీ తెలియని వయసులో వాటి బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరు కావాలనే తమ అక్రమ సంపాదన కోసం యువతకు డ్రగ్స్‌ అంటగడుతున్నారు. దేశాన్ని బలహీనపరిచేందుకు దేశద్రోహులు చేస్తున్న ప్రయత్నంగానూ దీన్ని చూడొచ్చు. రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మనపైనే ఉంది. 

డ్రగ్స్‌ నిర్మూలనకు నార్కోటిక్‌ బ్యూరోకు ఎంత బడ్జెట్‌ అయినా కేటాయిస్తాం. వాటి వినియోగం, రవాణా లేకుండా చేయాల్సిన బాధ్యత ఆ అధికారులదే. పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగమే కాకుండా ప్రజల నుంచి కూడా సహకారం అందాలి. డ్రగ్స్‌ సరఫరా చేసేవారు ఎక్కడున్నా అరెస్ట్‌ చేసే శక్తి సామర్థ్యాలు పోలీసు వ్యవస్థకు ఉన్నాయి. పోలీసులకు సమాచారం ఇచ్చే వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి. అన్ని గ్రామాల్లో డ్రగ్స్‌ నిర్మూలన కమిటీలు వేయాలి. కొత్త వ్యక్తులపై ఎల్లప్పుడూ నిఘా ఉంచాలి. తాత్కాలిక సంతోషాలకు విద్యార్థులు బలి కావొద్దు. వారు అడ్డదారులు తొక్కితే కుటుంబంతో పాటు సమాజం మొత్తం బాధపడాల్సి ఉంటుంది’’ అని భట్టి విక్రమార్క అన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని