Published : 19 Aug 2022 01:48 IST

Fake Police Station: ఏకంగా నకిలీ పోలీస్‌ స్టేషన్‌ నిర్వహణ.. బిహార్‌లో ఓ ముఠా దుశ్చర్య!

పట్నా: కొంతమంది నకిలీ పోలీసులుగా నటిస్తూ.. జనాలను మోసగిస్తుంటారు. కానీ.. బిహార్‌లోని బాంకాలో దీన్ని తలదన్నే ఓ విస్మయకర వ్యవహారం వెలుగుచూసింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఎనిమిది నెలలపాటు ఓ ముఠా నకిలీ పోలీస్‌ స్టేషన్‌ను నిర్వహించింది. అదీ.. పట్టణ పోలీస్‌స్టేషన్‌కు, స్థానిక ఎస్పీ నివాసానికి కొద్ది దూరంలోనే.. ఓ గెస్ట్‌హౌస్‌లో కావడం గమనార్హం. ముఠా సభ్యులు పోలీసుల మాదిరి దుస్తులు ధరించి.. వందలాది మంది నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఇద్దరు మహిళలు సహా అయిదుగురిని అరెస్టు చేశారు.

ఎలా బయటపడిందంటే..

పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ శంభు యాదవ్‌ బుధవారం సాయంత్రం.. ఈ ముఠాలోని ఇద్దరు సభ్యుల వద్ద సర్వీస్‌ రివాల్వర్‌కు బదులుగా దేశీయ తుపాకులను గుర్తించారు. ఈ క్రమంలో వారిని ఆరా తీయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ వ్యవహారంలో అనితా దేవీ ముర్ము, ఆకాశ్‌ మాంఝీ, రమేష్ కుమార్, వకీల్ కుమార్, జూలీ కుమారి మాంఝీ అనే అయిదుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు బాంకా ఎస్పీ సత్యప్రకాష్ ధ్రువీకరించారు. అయితే, ప్రధాన నిందితుడు భోళా యాదవ్‌ పరారీలో ఉన్నాడని.. అతని ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.

ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ..

నిందితుల విచారణ క్రమంలో అనేక విషయాలు బయటపడ్డాయి. ‘ముఠా సభ్యులు ఎస్సై, డీఎస్పీ బ్యాడ్జీలతో కూడిన యూనిఫాంలు ధరించేవారు. నిజమైన తుపాకులనూ వెంటపెట్టుకునేవారు. ఆయా వ్యవహారాల్లో స్టేషన్‌ను ఆశ్రయించే స్థానికుల నుంచి డబ్బు వసూలు చేసేవారు. అదే సమయంలో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కల్పిస్తామని, పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసేవారు. స్టేషన్‌లో ఇతర పోలీసు అధికారుల మాదిరి నటించేందుకు గ్రామీణ ప్రాంత ప్రజలను ఎంచుకుని రోజువారీ జీతం ఇచ్చేవారు. వాస్తవానికి.. అనిత, జూలీలు పోలీసు ఉద్యోగం కోసం భోళాకు రూ.90 వేలు, రూ.55 వేలు ముట్టజెప్పగా.. అతను వారిని నకిలీ ఠాణాలో నియమించాడు. అయితే ఆ ఇద్దరూ.. నిజమైన పోలీసులుగా రిక్రూట్‌ అయ్యామని భావించారు’ అని అధికారులు తెలిపారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts