Bihar Girl: ఆ బాలికకు కృత్రిమ కాలు అమరిక

బుజానికు పుస్తకాల సంచి వేసుకొని ఓ పదేళ్ల బాలిక ఒంటికాలిపై బడికి వెళుతున్న ఓ వీడియో నెట్టింట సంచలనంగా మారిన విషయం తెలిసిందే......

Updated : 28 May 2022 16:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  పుస్తకాల సంచి వేసుకొని ఓ పదేళ్ల బాలిక ఒంటికాలిపై బడికి వెళుతున్న ఓ వీడియో నెట్టింట సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కానీ ఇకపై ఆ బాలిక ఒంటికాలితో నడవాల్సిన అవసరం లేదు. వైద్యులు ఆమెకు కృత్రిమ కాలును అమర్చారు. కృత్రిమ కాలు అమర్చడంతో ఆ విద్యార్థిని రెండు కాళ్లపై నిలుచొని ఉన్న ఫొటోను ఛత్తీస్‌గఢ్ కేడర్‌కు చెందిన 2009 బ్యాచ్ ఐఏఎస్‌ అధికారి అవనీష్ శరణ్ ట్విటర్‌లో పంచుకున్నారు. ఇదీ సోషల్‌ మీడియా పవర్ అంటూ ఆనందం వ్యక్తం చేశారు.

బిహార్‌లోని జుముయ్‌ జిల్లాకు చెందిన సీమా అనే పదేళ్ల బాలికకు సంబంధించిన ఓ వీడియో కొద్దిరోజుల క్రితం సామాజిక మాధ్యమాలను ఊపేసింది. రెండేళ్ల క్రితం సీమాకు ఓ ప్రమాదం జరగ్గా.. వైద్యులు ఆమె ఎడమ కాలును పూర్తిగా తొలగించారు. అయితే తన వైకల్యానికి ఆమె కుంగిపోలేదు. ఏడాదిలో పూర్తిగా కోలుకొని బలంగా నిలబడింది. ఒంటికాలితోనే కిలోమీటరు దూరంలో ఉన్న స్కూలుకు ప్రతిరోజు వెళ్లేది. అయితే ఆమె పాఠశాలకు వెళుతున్న దృశ్యాలను కొద్దిరోజుల క్రితం కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచగా విశేష స్పందన వచ్చింది. అనేకమంది ఆమెను ప్రశంసించారు. ఆమె మనోధైర్యం, చదువుకునేందుకు ఆమె చూపిస్తున్న ఆసక్తి పట్ల ముగ్ధులయ్యారు. ప్రముఖులు, అధికారులు ఆమెకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.

కొవిడ్‌ లాక్‌డౌన్‌లో ఆపద్బాంధవుడిలా నిలిచిన సోనూసూద్‌ కూడా స్పందించారు. సీమా ఒంటికాలిపై నడుస్తున్న వీడియోను రీట్వీట్‌ చేస్తూ.. ఇకపై ఆమె ఒక కాలితో కాకుండా రెండు కాళ్లతో పాఠశాలకు పరిగెడుతుందని హామీ ఇచ్చారు.సీమాపై వచ్చిన కథనాలపై అంతకుముందే వైద్య శాఖ స్పందించింది. వైద్యశాఖ అధికారులు వచ్చి సీమా కాలిని పరిశీలించారు. వైద్యసిబ్బంది కృత్రిమ కాలుని అమర్చినట్లు సమాచారం.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని